ఇంటర్వ్యూ: ఆస్కార్ రేసులో తెలుగు షార్ట్ ఫిలిమ్..

ఒక చిన్న షార్ట్ ఫిలిమ్ రేంజ్ ఎంత ఉంటుంది..? మహా అయితే అది మరో పెద్ద సినిమాకి దారి తీసేంతలా..! కానీ, ఈ తెలుగు షార్ట్ ఫిలిమ్ జర్నీయే వేరు. సినిమా కళాకారులు కలలు కనే ఆస్కార్ బరిలో నిలవబోతున్న ఈ షార్ట్ ఫిలిమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఆ షార్ట్ ఫిలిమ్ పేరే..

“మనసానమః”

ఎంత మనసు పెట్టి తీసాడో అంత ఎత్తుకు ఎదిగింది. ఆ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ దీపక్ గారితో నేటి ఇంటర్వ్యూ..

 

హాయ్, దీపక్ గారూ..

ఇప్పుడు మీ షార్ట్ ఫిలిమ్ ఆస్కార్ కి క్వాలిఫై అయ్యిందా?

అవును.. క్వాలిఫై అయిన సినిమాలు స్క్రీనింగ్ జరుగుతాయి. ఆ తర్వాత అందులోంచి కొన్ని సినిమాలని నామినేట్ చేస్తారు. అంటే ప్రస్తుతం మనం నామినేషన్ కి రేసులో ఉన్నట్టు.

ఈ షార్ట్ ఫిలిమ్ కి 900 ప్లస్ అవార్డ్స్ వచ్చాయంట కదా.. గిన్నిస్ రికార్డ్ అని తెలిసింది.

అవును, నిజానికి 385 దగ్గరే గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేసాం. కాకపోతే రికార్డ్ రావడానికి కొంచెం టైమ్ పడుతుంది. అదంతా ప్రాసెస్ లో ఉంది.

ఆస్కార్ రేసులో ఉన్నఈ షార్ట్ ఫిలిమ్ కి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇది మీ కథేనా..?

నాదనే కాదు, అందరి లైఫ్ లోనూ జరిగే కథే ఇది. దాన్నే కొత్తగా ప్రెజెంట్ చేద్దామని చేసాను.

కథని రివర్స్ లో ఎందుకు చెప్పాలనుకున్నారు?

ఐతే, ఏ కథైనా ఎండింగ్ ఎలా ఉన్నా, బిగినింగ్ మాత్రం హ్యాపీగా ఉంటుంది. రిలేషన్ షిప్ లో కూడా అంతే. ఒక రిలేషన్ షిప్, చివరికి ఎటు వెళ్తుందో తెలియకపోయినా, దాని స్టార్టింగ్ పాయింట్ మాత్రం హ్యాపీగా ఉంటుంది. తలచుకున్నప్పుడల్లా నోస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీల్ ఎప్పుడూ మధురంగా ఉంటుంది. అందుకే, అలా చెప్పాలనుకున్నాం.

షార్ట్ ఫిలిమ్ మొత్తం హీరో వెర్షన్ లో ఉంటుంది కదా, చివర్లో పాటలో అమ్మాయి వెర్షన్ చూపించారు. దాని గురించి చెప్పండి.

జనరల్ గా మనం ఎప్పుడూ ఒకరు చెప్పిందే వింటాం. అవతలి వారి వెర్షన్ వినము. ఇక్కడ షార్ట్ ఫిలిమ్ లో కూడా సూర్య, తన వెర్షనే చెబుతాడు. కానీ, అటు సైడ్ కూడా ఏముందో చూడాలనే అలా చేసాము.

ఈ షార్ట్ ఫిలిమ్ లో డైలాగ్స్ గురించి చెబుతారా? మెయిన్ గా బుగ్గ సొట్టలో ఇరుక్కున్న టైమ్ అనేది హైలైట్.

అది, డైలాగ్స్ కొన్ని మెటఫర్ గా ఉండాలని రాసుకున్నాం, తెగే తాడు అన్నప్పుడు తాడు తెగిపోవడం కానీ, గాల్లో కట్టుకున్న మేడలు అన్నప్పుడు, బిల్డింగ్ బ్లాక్స్ పడిపోవడం గానీ అలా ప్లాన్ చేసినవే.
చూసే వాళ్ళకి ఇటు మాటలు విన్నా, సీన్ చూసినా ఒకేలా అర్థమయ్యేలా ఉండాలని అనుకున్నాను.

జనరల్ గా షార్ట్ ఫిలిమ్ అనే దానికి ఇంతకు ముందున్నంత రెస్పాన్స్ ఇప్పుడు లేదు కదా.. ! మరి మీరు ఏం ఊహించి సినిమా తీసారు?

నిజమే, షార్ట్ ఫిలిమ్ అనే దానికి ఇప్పుడు వాల్యూ లేదు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సుజిత్ లాంటి వాళ్ళు చేసినపుడు చాలా ఉండింది. ఇప్పుడు అంత లేదు. మనసానమః తీసినపుడు కూడా ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఫిలిమ్ మేకర్ గా నా కెపాసిటీ ఏంటో తెలుసుకుందామని ట్రై చేసాను.

వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటంటారు..?

ఫ్రీ ఫ్లాట్ ఫామ్, ఎలా అయినా తీయచ్చు. అండ్, చాలా మందిలో సీరియస్ నెస్ లేకపోవడం కూడా ఓ రీజనే. ఏదో తీసేద్దాంలే అని తీసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే షార్ట్ ఫిలిమ్ అనే దానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.

షార్ట్ ఫిలింస్ చూడని ఈరోజుల్లో సినిమా తీసిన మీరు, ఏ పాయింట్ దగ్గర సాటిస్ఫై అయ్యారు? ఐ మీన్, ఇంత చేసాం కదా.. దానికి ఇది దక్కింది అని ఎక్కడైనా అనిపించిందా?

ఇంత చేసాం అని నేననుకోలేదు. నాకు తెలిసి ప్రతీ డైరెక్టరూ తన సినిమాలో ఇంకా ఏదో మిస్ అయిందనే ఫీల్ అవుతాడు. నాకూ అలాంటి ఫీలింగే ఉంది. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి, అవతలి వారి వ్యాలిడేషన్ ని నేను తీసుకోను. కానీ, నేను చెప్పాలనుకున్నది అవతలి వారికి రీచ్ అయ్యిందని కొంత లెవెల్ వరకు సాటిస్ఫై అయ్యాను.

మరి మీ షార్ట్ ఫిలిమ్ కి బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుండి వచ్చింది?

బెస్ట్ అంటే, హాలీవుడ్ సినిమా 500డేస్ ఆఫ్ సమ్మర్ డైరెక్టర్ నుండి వచ్చింది. రొమాన్స్ లో వర్కౌట్ అవ్వని టెక్నిక్ లో సినిమా తీసి, మెప్పించగలిగావని చెప్పారు. ఇంకా, గౌతమ్ మీనన్ సార్, ఈ షార్ట్ ఫిలిమ్ ని చూసి చాలా అద్భుతంగా ఉందని, తమిళంలోకి డబ్ చేసి, రిలీజ్ చేసారు. ఇటు సుకుమార్ గారు బ్రిలియంట్ గా ఉందని చెప్పారు. ఇంకా చాలామంది మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

మనసానమః అనే టైటిల్ కి అర్థం ఏంటి?

బేసిక్ గా సెల్ఫ్ డిస్కవరీ అని చెప్పవచ్చు.

ఎటు నుండి చదివిన ఒకేలా అర్థం వచ్చేలా టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి మరి?

సినిమా మొత్తం రివర్స్ లో ఉంటుంది కదా, అందుకే అలా ప్లాన్ చేసి మరీ పెట్టాం.

మీరింతకు ముందు ఏ సినిమాకైనా వర్క్ చేసారా?

అమెరికాలో ఉన్నప్పుడు ఫిదా సినిమా ప్రొడక్షన్ టీమ్ లో వన్ మంత్ చేసాను. ఆ తర్వాత ఇండియాకి వచ్చేసాను. ఏ సినిమాకీ వర్క్ చేయలేదు.

అసలు డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి?

డైరెక్టర్ కి కన్విక్షన్ ఉండాలి. కథను ఎందుకు చెప్పాలనేది డైరెక్టర్ కి తెలియాలి. ఏ పాయింట్ చెప్పాలనుకున్నా దాన్ని నమ్మాలి. స్కిల్ కూడా కావాలి.

అంటే అనుభవం ఉండాలంటారా?

ఎక్స్ పీరియన్స్ ఉంటే మంచిదే. కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పలేను. ఎక్స్ పీరియన్స్ లేనపుడే ఒరిజినల్ కథలు వస్తాయని నేను నమ్ముతా.

సినిమాలు తీయాలంటే సినిమాలు చూడాలా?

అలా ఏం చెప్పలేము. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఎలా అయినా చేయవచ్చు. కొందరు సినిమాలు చూడకపోయినా చాలామంచి సినిమాలు తీస్తారు.

మీకు మళయాలీ సినిమాలు ఎక్కువ ఇష్టం అని విన్నాను..!

అలా అని ఏమీ లేదు. ఈ మధ్య మళయాలీ సినిమాలు ఎక్కువ చూసాను. అంతే. ఎమోషన్ ఉన్న ఏ సినిమా అయినా ఎంజాయ్ చేస్తాను.

మనసానమః కాకుండా ఇంకేమైనా షార్ట్ ఫిలిమ్స్ తీసారా?

ఇది నా ఫోర్త్ షార్ట్ ఫిలిమ్. ఇంతకుముందు హైడ్ అండ్ సీక్ అనీ, ఎక్స్ క్యూజ్ మీ అని తీసాను.

మీరు సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చారా?

లేదు. మా ఫ్యామిలీలో అందరూ హైలీ ఎడ్యుకేటెడ్సే ఉన్నారు. నేనొక్కణ్ణే సినిమాల మీద ఇంట్రెస్ట్ తో వచ్చాను. అది కూడా అమెరికాలో మాస్టర్స్ చేసి ఇటు సైడ్ వచ్చాను.

ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు?

మెసేజ్ ఇచ్చేంత నా దగ్గరేమీ లేదు, కానీ మనసుకు నచ్చింది తీయండి మాత్రం చెప్పగలను. సినిమాకి ఉన్న లిమిటేషన్స్ షార్ట్ ఫిలిమ్ కి ఉండవు కాబట్టి, అనుకున్నది తీస్తే మంచిదని నా ఉద్దేశ్యం.

అవార్డ్స్ కోసం షార్ట్ ఫిలిమ్స్ తీయొచ్చా?

అవార్డ్స్ కోసం మాత్రం తీస్తే లాభం లేదు. నాకు అవార్డు వచ్చిందని చెప్పుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని నా ఇంటెన్షన్. మనసానమః కి అవార్డ్స్ వచ్చాయి. కానీ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నీ, ఒక్క అవార్డు కూడా రాకముందే వచ్చాయి. లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక అన్ని ఫిలిమ్ ఫెస్టివల్స్ కి సినిమా పంపుతూ కూర్చున్నా.. కానీ అవార్డ్స్ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. కాకపోతే ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ఎక్కడెక్కడి నుండో కనెక్షన్స్ పెరుగుతాయి. అది రేపు ఫీఛర్ ఫిలిమ్ తీసేటపుడు హెల్ప్ అవుతుంది.

అవార్డ్స్ కి డబ్బులు కూడా వస్తాయా?

అన్నింటికీ రావు. చాలా మటుకు డబ్బులు రావు. ఏవో కొన్ని మాత్రమే డబ్బులు ఇస్తాయి. ఐతే, అవార్డు కోసం ఫిలిం ఫెస్టివల్స్ కి పంపడానికి మాత్రం ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. ఈ విషయంలో నాకు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసారు.

ఇప్పుడు మనసానమః షార్ట్ ఫిలిమ్ యూట్యూబ్ లో లేదు కదా..! మరి ఎక్కడ చూడాలి?

యూట్యూబ్ లో లేదు. జనవరి లేదా ఫిబ్రవరిలో అవైలబుల్ లోకి వస్తుంది.

మనసానమః వేరే భాషల్లో కూడా ఉన్నట్టుంది కదా..!

హా.. తమిళం, కన్నడ భాషల్లో డబ్ చేసాము. మళయాలంలో కూడా చేస్తున్నాం.

హిందీలో డబ్ చేయట్లేదా మరి?

హిందీలో చాలామంది రైట్స్ అడిగారు. కానీ, డబ్బింగ్ ఎలా ఉంటుందో అన్న భయంతో ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు. కాకపోతే హిందీలో కూడా డబ్ చేయాలని ప్లాన్ ఉంది.

ఇప్పుడు మీరేం చేస్తున్నారు?

సినిమా చేస్తున్నా..

మీకు హీరో ప్రభాస్ గారు అంటే ఇష్టం కదా..! మరి ప్రభాస్ గారు సినిమా చూసారా?

ప్రభాస్ గారు ఇంకా సినిమా చూడలేదు. చూస్తారు.

ఫైనల్ గా మీ మనసానమః షార్ట్ ఫిలిమ్, ఆస్కార్ రేసులో మరింత ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం..

థ్యాంక్యూ..