మెగాస్టార్ చిరంజీవి మాటలు మెగా హీరోలన్నా వింటారా..?

-

ఒకప్పుడు సినిమా నిర్మాణానికి ఇప్పుడు సినిమా నిర్మాణానికి అసలు సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు సెట్ కి హీరో వస్తున్నాడంటే షూటింగ్ స్పాట్ లో అదనపు సౌకర్యాలే ఎక్కువగా ఉండాలి. అలాంటి వాటికే బడ్జెట్ లో సగం ఖర్చు అవుతోంది. అందుకే ఇప్పుడు యావరేజ్ హీరో తో ఒక సినిమా నిర్మించాలన్నా కూడా బడ్జెట్ బాగా పెరిగిపోతోంది. కొన్ని సందర్భాలలో ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఓవర్ బడ్జెట్ అయి నిర్మాత తలకి మించిన భారం అయిపోతుంది. దీంతో సినిమా టాకీ పార్ట్ సగం అయినప్పటి నుంచే నిర్మాతకి గుండె దడ మొదలవుతుంది. అదృష్టం కలిసొచ్చి సినిమా హిట్టయితే నిర్మాత సేఫ్. లేదంటే ఉన్న ఆస్థులు అమ్ముకోవాలి. లేదా ఆత్మ హత్య చేసుకోవాలి. దీని మీద తాజా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.

 

కొన్ని సంవత్సరాల క్రితం లక్షలతో సినిమాను తీసేవారు. కాని ఇప్పుడు లక్షలు క్యారవాన్ కిరాయికి కూడా సరిపోవడం లేదు. అంటూ చిరంజీవి ఇటీవల ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. క్యారవాన్ వల్ల చాలా సమయం వృదా అవ్వడంతో పాటు నిర్మాతకు ఆర్థికంగా భారం అవుతోంది. ఈ విషయాలలో నేటి తరం హీరోలలో మార్పు రావాలి.. నిర్మాత గురించి ఆలోచించాలని చిరంజీవి తెలిపారు. అయితే ఇందుకు పాజిటివ్ రెస్పాన్స్ మన టాలీవుడ్ యంగ్ హీరోల నుండి రావడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి.

గతంలో క్యారవాన్ లు లేకుండా షూటింగ్స్ చేసేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదని యంగ్ హీరోలు అంటున్నారు. షాట్ కు రెడీ అవ్వాలన్న, డైలాగ్ ప్రాక్టీస్ కు క్యారవాన్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు. క్యారవాన్ లు లేకపోతే అవుట్ డోర్ షూటింగ్స్ సమయంలో జనాల తాకిడి వల్ల ఇబ్బంది పడవలసి వస్తుందని టాలీవుడ్ హీరోలు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. మరి ఈ విషయంలో బయట హీరోల సంగతి ఎలా ఉన్నా మెగాస్టార్ సూచనలను కనీసం మెగా హీరోలు అయినా పాటిస్తారా అన్నది అనుమానమే. నిజంగా మెగాస్టార్ చెప్పినట్టు ఈ మార్పు ముందు మెగా హీరోలలో వస్తే మాత్రం దాని వల్ల చాలా మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news