ట్విట్టర్‌లో చిరు దూకుడు..మెగాస్టారా.. మజాకా!

ఉగాది పర్వదినాన చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు అలా అడుగేశాడో లేదో లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న చిరంజీవి.. సోషల్ మీడియాను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వరుస బెట్టి ట్వీట్స్ చేస్తూ రఫ్పాడిస్తున్నాడు. నిన్న వరుసగా ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయగా.. నేడు ట్విట్టర్ దుమ్ము దులుపుతున్నాడు.

 

మొదటి రెండు ట్వీట్స్‌లో ఉగాది శుభాకాంక్షలు, కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు వివరించి, లాక్ డౌన్‌ను అందరూ పాటించాలని ఇంట్లోనే ఉందాం..సురక్షితంగా ఉందాం అనే పిలుపునిచ్చాడు. ప్రధాని, ముఖ్యమంత్రుల నిర్ణయాలు గౌరవిద్దామని సూచించాడు. ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ గురించి చెప్పగా.. అంజనమ్మ ఫోటో షేర్ చేస్తూ హోమ్ టైమ్ మామ్ టైమ్.. ఇలాంటి సమయంలో అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు.

ఇక చిరు ట్విట్టర్ ఎంట్రీపై సినీ తారలంతా స్పందించారు. మెహన్ బాబు, ఎన్టీఆర్, మోహన్ లాల్, సుహాసిని, రాధికా, తమన్నా, కాజల్, దేవీ శ్రీ ప్రసాద్, శ్రీకాంత్, పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్, కొరటాల శివ ఇలా ఎంతో మంది సెలెబ్రిటీలు చిరుకు స్వాగతం పలికారు. నేడు వారందరికీ తనదైన శైలిలో రిప్లై ఇస్తూ ట్విట్టర్‌ను షేక్ చేసేస్తున్నాడు చిరు. అన్నింటిలోకెల్లా మోహన్ బాబుకు ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. రాననుకున్నావా.. రాలేననుకున్నావా? అంటూ పంచ్ డైలాగ్ విసురుతూ.. థ్యాంక్యూ మిత్రమా అంటూ ట్వీట్ చేశాడు.