హైదరాబాద్, 21 మార్చి 2024: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’. ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. అనూహ్యమైన కథతో రానున్న ‘మా అన్నయ్య’ మార్చి 25న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు, మీ జీ తెలుగులో!
మా అన్నయ్య సీరియల్ కథ గంగాధర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ నటుడు గోకుల్ మీనన్ గంగాధర్ పాత్రలో కనిపించనున్నారు. రాధమ్మ కూతురులో అరవింద్ పాత్రను పోషించడం ద్వారా విజయవంతంగా తన స్టార్ పవర్‌ని స్థాపించుకున్నారు.
చిన్న వయసు నుంచే తన చెల్లెళ్ల బాగోగులు చూసుకునే బాధ్యతను తీసుకున్న ఒక అన్నయ్య కథే మా అన్నయ్య. గంగాధర్ తండ్రి మల్లికార్జున్ (ఉదయ్) బాధ్యతారాహిత్యంగా తాగుడుకు బానిస కావడంతో అతను తన నలుగురు చెల్లెళ్ల బాధ్యత తీసుకుంటాడు. తల్లి సావిత్రి (రాశి) కూడా చిన్నతనంలోనే పిల్లల్ని వదిలేయడంతో చెల్లెళ్ల బాధ్యత గంగాధర్ తీసుకోవాల్సి వస్తుంది. తన చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి వారి జీవితం ఆనందంగా సాగేలా చూడాలని కలలు కంటాడు గంగాధర్. అందుకోసం చాలా కష్టపడతాడు. కానీ అతని చెల్లెళ్లు వారివారి ఇష్టాలు, లక్ష్యాలకనుగుణంగా సాగాలని భావిస్తారు. ఈ ప్రయాణంలో గంగాధర్, అతని చెల్లెళ్లు ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలు, పంచుకునే భావాలు, బాధ్యతల సమాహారమే మా అన్నయ్య సీరియల్.
ఒక మధ్యతరగతి కుటుంబంలో తోబుట్టువుల మధ్య బంధాన్ని మా అన్నయ్య సీరియల్ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ సీరియల్కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచనాలను మరింతగా పెంచేశాయి. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల అంచనాలను మించి వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది.
ఈ షో గ్రాండ్ లాంచ్ మరియు దాని కథాంశం గురించి జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – అనురాధ గూడూరు మాట్లాడుతూ, జీ తెలుగు ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో మరొక విలక్షణమైన కథను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ఆకట్టుకునే కథాంశం, ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందుతున్న ఈ కథ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా, తెలుగు బుల్లితెరపై తొలిసారిగా ఒక కథానాయకుడి కోణం నుంచి చూడబోతున్న మా అన్నయ్య ప్రేక్షకులను తప్పక అలరిస్తుందనే నమ్ముతున్నాను. ఈ సీరియల్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణ, మద్దతుతో ఓ అద్భుతమైన కథను విజయవంతంగా కొనసాగిస్తామని ఆశిస్తున్నాం’ అన్నారు.
ప్రధాన పాత్ర పోషిస్తున్న గోకుల్ మీనన్ మాట్లాడుతూ..
‘జీ తెలుగులో నేను నటిస్తున్న రెండో సీరియల్ ఇది. మా అన్నయ్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేను ఈ కథలో నలుగురు చెల్లెళ్లకి అన్న పాత్రలో కనిపిస్తాను. ఒక మంచి కథలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సోదరుడు తన చెల్లెళ్లకి తండ్రి, స్నేహితుడిగా ఎలా వ్యవహరిస్తాడు అనేది ఈ కథ ద్వారా ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సీరియల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. భావోద్వేగాలతో కూడిన ఇలాంటి లోతైన పాత్రను పోషించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు.
ఈ సీరియల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ప్రేక్షకులకు చక్కని వినోదం పంచడమే లక్ష్యంగా పలు ప్రతిష్టాత్మక సినిమాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మొదటి సీరియల్ మా అన్నయ్య. ఈ సీరియల్ ప్రారంభం సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ.. ‘వెండితెరపైనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకూ వినోదం పంచడంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆకట్టుకునే సీరియల్స్, కార్యక్రమాలతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు మా పరిధిని విస్తరించేందుకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. భావోద్వేగభరితమైన కథతో రూపొందుతున్న ‘మా అన్నయ్య’ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు ఉత్సాహంగా ఉన్నాం. వెండితెర మాదిరిగానే బుల్లితెరపైనా ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆత్మవిశ్వాసం ప్రధానాంశాలుగా సాగే మా అన్నయ్య సీరియల్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి!
మా అన్నయ్య ప్రారంభంతో మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. సోమవారం నుంచి శనివారం వరకు రాధమ్మ కూతురు మధ్యాహ్నం 12 గంటలకు, ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 3 గంటలకు, చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతాయి. ఇన్నాళ్లుగా ప్రేక్షకులను అలరించిన రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ మార్చి 23న ముగియనుంది. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక మా అన్నయ్య, మార్చి 25న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు మీ జీ తెలుగులో!