ప్రజారాజ్యంలో కృష్ణంరాజు.. క్రియాశీలకంగా పని చేశారు – పవన్ కళ్యాణ్ ట్వీట్

-

ప్రజారాజ్యంలో కృష్ణంరాజు.. క్రియాశీలకంగా పని చేశారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్‌ తెలిపారు.

మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారన్నారు.

బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news