వైరల్ అవుతున్న పెళ్లి సందడి హీరో రోహన్‌ స్టిల్స్…!

24 ఏళ్ల క్రితం థియేటర్స్‌లో పెళ్లి సందడి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆడియో ఇప్పటికీ మారు మోగుతూనే వుంది. ఇదే టైటిల్‌తో సినిమాను రాఘవేంద్రరావు ఎనౌన్స్‌ చేయడంతో పెళ్లిసందడికి సీక్వెల్లా? రీమేకా? అన్న డౌట్ మొదలైంది. దీనికి దర్శకేంద్రుడు క్లారిటీ ఇవ్వకపోయినా.. హీరోను ఎనౌన్స్‌ చేసి సస్పెన్స్‌కు తెర దించారు.

ఈ కొత్త పెళ్లిసందడిని రాఘవేంద్రరావు డైరెక్షన్‌ చేయకపోయినా.. ఆయన దర్శకపర్యవేక్షణలోనే రూపొందుతోంది. గౌరీ రోనకి దర్శకత్వంలో ఆర్కా మీడియా.. కె. కృష్ణ మోహనరావు అసోసియేట్స్‌ కలిసి పెళ్లిసందడిని నిర్మిస్తున్నారు. పెళ్లిసందడికి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చిన కీరవాణి ఆల్రెడీ ట్యూన్స్‌ ఇచ్చేశారు. పెళ్లిసందడి టైటిల్‌తో సినిమా అంటే… హీరో ఎవరని చాలా ఊహాగానాలు నెట్టింట్లో తిరిగాయి. నాగ అశ్విన్‌ హీరోగా నటిస్తాన్న ప్రచారానికి తెరదింపిన దర్శకేంద్రుడు ఎవరి ఊహకూ అందని విధంగా శ్రీకాంత్‌ కొడుకు రోహన్‌ను సెలెక్ట్‌ చేసుకున్నాడు. 24 ఏళ్ల క్రితం శ్రీకాంత్‌ పెళ్లి సందడి చేస్తే.. బాక్సాఫీస్‌ సంబరపడిపోయింది. 29 సెంటర్స్‌లో 175 రోజులు ఆడింది. ఉత్తమ దర్శకుడిగానే కాకుండా.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నాడు రాఘవేంద్రరావు. ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కీరవాణిని నంది వరించింది.

దర్శకేంద్రుడు రిలీజ్‌ చేసిన రోహన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీకాంత్‌ ప్లేస్‌ను చక్కగా భర్తీ చేశారంటున్నారు నెటిజన్లు. మరి ఆయన కను సన్నల్లో నడిచే ఈ పెళ్లి సందడి 24 ఏళ్లనాటి పెళ్లిసందడిని మరిపిస్తుందో లేదో చూడాలి.