ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి జన్మస్థలంపై ఎంత పెద్ద చర్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో టీటీడీ, కిష్కింద సంస్థాన్ ట్రస్టు మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఆంజనేయ స్వామి మావాడంటూ ఇరు వర్గాల ప్రతినిధులు పెద్ద ఎత్తున చర్చకు తెర లేపుతున్నారు. హనుమంతుడి జన్మస్థలంపై జరుగుతున్న వివాదంపై బ్రహ్మానందం స్పందించారు. అయితే ఇదే విషయంపై ఇప్పటికే ఎంతోమంది స్పందించారు.
ఇక తాజాగా దీనిపై బ్రహ్మానందం కూడా స్పందించారు. ఈ వివాదం గురించి ఓ టీవీ ఛానల్లో హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతితో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం లైవ్‌లో ఫోన్ కాల్‌లో అందుబాటులోకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆంజనేయుడు ఎక్కడ పుట్టారన్నది వివాదం చేయడం ఏమాత్రం సమంజసం కాదని , ఆంజనేయుడు కేరళలో పుట్టారా? కర్ణాటకలో పుట్టారా? ఆంధ్రాలో పుట్టారా? అనడం కంటే.. మనమందరం కలిసి ఆయన భారతదేశంలో పుట్టారని గర్వపడితే మంచిదని చురకలంటించారు.
ఆంజనేయస్వామి ఎక్కడ పుడితే మాకెందుకండి..? ఆయన భక్తికి నిదర్శనం. మా మనసుల్లో, మాటల్లో, భావాల్లో మేం ఆయన్ను పూజించుకుంటాం.. దర్శించుకుంటాం. ఆయన మా దగ్గర పుట్టారని వీళ్లు, ఇంకొక దగ్గర పుట్టారని వాళ్లు.. ఈ వివాదం వల్ల ప్రజలం కన్ఫ్యూజన్ అవుతున్నాం.
పండగ రోజు నాలుగు మంచి మాటలు చెబితే విందాం అనుకుంటే.. మీరు ఈరకంగా పోట్లాడుకోవడం ధర్మం కాదు. ఆంజనేయస్వామి గురించి మనం తెలుసుకోవాల్సినవి ఆచరించాల్సిన ధర్మాలు చెప్పండి, అంతేగానీ.. మా నది ఒడ్డున పుట్టాడు, మా కిష్కిందలో పుట్టాడు, మా వాడు అని రాష్ట్రాల కింద కొట్టుకునే స్థితికి మనం దిగజారవద్దని మనవి చేసుకుంటున్నానన్నారు. కాబట్టి దయచేసి ఎవరూ దీన్ని వివాదాస్పదంగా మార్చొద్దంటూ కోరారు. ఇక తిరుమల కొండపైనే హనుమంతుడు పుట్టాడని ఓ వైపు టీటీడీ ప్రకటిస్తోంది. మరి దీన్ని ఇంకా ఎలా పరిష్కరిస్తారో చూడాలి.