తెలంగాణలోని 19 జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానాల్లో వైద్య పరీక్ష కేంద్రాలను డయాగ్నొస్టిక్ సెంటర్లను (Diagnostic centers) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈ మేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నేడు వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సీఎం తెలిపారు. నిర్ధారించిన రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు మెసీజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్ కేంద్రాల్లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయని వివరించారు. వీటితో పాటుగా ఈసీజీ, టుడీ ఈకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఇవి అత్యంత సామర్థ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందిస్తాయన్నరు. పైన తెలిపిన పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం, గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత ఖశ్చితత్వంతో అందచేస్తాయని తనకు వైద్యాధికారలు తెలిపారని సీఎం అన్నారు.