కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. సినీ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో వాయిదాల పర్వం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి విడుదల తేదీలను కూడా ప్రకటించిన సినిమాలు దిక్కుతోచని పరిస్థితుల్లో వాయిదా పడుతున్నాయి.
ఇప్పటికే నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’, నాని ‘టక్ జగదీశ్’ మూవీలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’, వెంకటేష్ చేస్తున్న ‘నారప్ప’, బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’, రవితేజ ‘ఖిలాడి’, అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాల విడుదల తేదీలు ఖరారయినప్పటికీ నిర్మాతల్లో ఒకింత కలవరం వెంటాడుతోంది. ఈ సినిమాలు కూడా వాయిదా పడతాయనే టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారం పుష్పను ఆగష్టు 13న విడుదల చేయాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడం ఒక కారణమైతే.. మరోవైపు కరోనా వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటవుతున్నాయి. దీంతో పుష్పను మరో నాలుగు నెలలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఆగష్టు నుంచి డిసెంబర్ నెలకు రిలీజ్డేట్ ను మార్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 17న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలోచిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బన్నీ ఫ్యాన్స్కి ఇది పెద్ద నిరాశే అని చెప్పాలి.
వాయిదా పడనున్న పుష్ఫ.. కారణం అదేనా?
-