వాయిదా పడ్డ రవితేజ మూవీ షూటింగ్.. దెబ్బ తీసిన కరోనా

టాలీవుడ్ ను కొవిడ్ కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కరోనా భయానికి ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డాయి. మరి కొన్ని సినిమాలు షూటింగులు ఆపేశాయి. దీంతో ఇండస్ట్రీ మళ్లీ కుంటు పడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటే మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు ప్లాన్ చేసుకున్న వారంతా కేసులు ఎక్కువవుతుండటంతో నిలిపివేస్తున్నారు.

ఇక మాస్ మహారాజ రవితేజ శరత్‌ మండవను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. నటిస్తున్న సినిమాను ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కాగా సోమవారం నుంచి మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరిపేందుకు ప్లాన్ చేశారు. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్‌లో చేయాలనుకున్న మూవీ టీం..ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా వెనక్కు తగ్గింది. సినిమా తొలి షెడ్యూల్‌ను వాయిదా వేశారు నిర్మాతలు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని వేరే దేశంలో షూటింగ్ చేస్తుండటంతో వాయిదా పడలేదని తెలుస్తోంది. ఇతర దేశాల్లో పరిస్థితులు బాగానే ఉండటంతో పలు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి.

కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత పరిస్థితులను బట్టి షూటింగ్ ప్రారంభించాలని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, హీరో, దర్శకుడు భావిస్తున్నారంట. హైదరాబాద్‌ తో పాటు హార్స్‌లీ హిల్స్‌, చిత్తూరు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో దాదాపు 90 రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నారు. ఓ హీరోయిన్‌గా ‘మజిలీ’ ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు. కాగా మరో హీరోయిన్‌ కోసం చర్చలు జరుపుతున్నారు. మరి ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి.