లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్.. క్లీన్ యు ఇచ్చిన సెన్సార్..!

కొన్నాళ్లుగా వివాదాస్పద సినిమాగా క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఈ సినిమా సెన్సార్ కాకుండా అడ్డుకోవాలని కొంతమంది చూశారు. అయితే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి ఈసికి ఓ వివరణ పత్రం ఇచ్చారు. అంతేకాదు ఆయన్ను కలిసి సినిమాలో జరిగిన వాస్తవాన్ని మాత్రమే చూపించామని.. అవసరమైతే సినిమా రిలీజ్ తర్వాత ఈసీకి వివరణ ఇస్తామని అన్నారు.

ఒకపార్టీకి అనుకూలంగా ఈ సినిమా తీయలేదని.. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సినిమాను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు లేదని రాకేష్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 29న సినిమా రిలీజ్ చేస్తామని శపథం చేసిన ఆర్జివి అనుకున్నది సాధించాడు. చిన్న చిన్న కట్స్ తో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సెన్సార్ పూర్తి చేసుకుని యు సర్టిఫికెట్ అందుకుంది.

ఈ సందర్భంగా ట్రూత్ విన్ అంటూ చంద్రబాబుని ట్యాగ్ చేసి.. సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించిందని ఆర్జివి ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం ‘లక్ష్మీ ఎన్టీఆర్’ అని రాం గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. మరి రిలీజ్ ముందు ఇంత హంగామా చేసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ తర్వాత ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.