వెండితెర కథానాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు సొంతంగా సినిమా థియేటర్లు కూడా ఉండేవి. వాటిలో గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ థియేటర్ ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఏడాదిపాటు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఆ సినిమాల ప్రదర్శనకు పెమ్మసాని థియేటర్‌ను ఎంచుకున్నారు. సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్పై అభిమానం ఇప్పటికీ తగ్గలేదనిపిస్తోంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8గంటల 30 నిమిషాలకు మొదటి ఆటగా ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. సినీరంగానికి చెందిన ఓ ప్రముఖుడికి ప్రతినెలా ఎన్టీఆర్ అవార్డు అందజేస్తున్నారు. రాఘవేంద్రరావు, జయసుధ, అశ్వినిదత్, ఎల్.విజయలక్ష్మి వంటివారు ఇప్పటి వరకూ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ చిత్రాలన్నింటినీ డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమాతో ప్రదర్శనలు మొదలుపెట్టారు. శతాబ్ది ఉత్సవాలు పూర్తయ్యేసరికి 250కి పైగా సినిమాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.