‘ఇండియా లాక్‌డౌన్‌’.. టీజర్‌ చూశారా?

-

కరోనా.. గత రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఈ పేరు వినబడితేనే ప్రపంచ దేశాలు వణికిపోయిన రోజులున్నాయి. ఎంతో మంది కుటుంబాలు ఈ మహమ్మారి వల్ల రోడ్డున పడ్డాయి. ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. ఆప్తులను పొట్టనపెట్టుకున్న ఈ వైరస్ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్​డౌన్​లో ప్రజలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లాక్​డౌన్ ఆంక్షల వల్ల కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు.. భార్యకు దూరంగా భర్త.. దాదాపు ఏడాది పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా పరిస్థితులు, లాక్​డౌన్ ఇబ్బందులతో ఇప్పటికే చాలా సినిమాలు, సిరీస్​లు వచ్చాయి. తాజాగా వాటి జాబితాలో చేరింది ‘ఇండియా లాక్​డౌన్’ మూవీ.

మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. శ్వేత బసు ప్రసాద్‌, ప్రతీక్‌ బబ్బర్‌, సాయి తమంకర్‌, ప్రకాశ్‌ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఏంటి? వేశ్యవృత్తి వారిపై కరోనా ప్రభావం ఎలా పడింది? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను మధుర్‌ భండార్కర్‌ ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news