పెద్ద సినిమాలకు రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు వివాదాలు చెలరేగడం కామన్ అయిపోయింది. ఆ తర్వాత ఆ వివాదాలు వదిలేవరకు సినిమా మేకర్స్‌కు టెన్షన్ తప్పడం లేదు. తాజాగా రిలీజ్ అయిన మెగా హీరో వరుణ్ తేజ్ వాల్మీకి విషయంలో మరీ విచిత్రం జరిగింది. రిలీజ్‌కు కొద్ది గంటల ముందే ఆ సినిమా వాల్మీకి టైటిల్ కాస్త గద్దలకొండ గణేష్‌గా మార్చారు. ఇక ఇప్పుడు సైరాకు రిలీజ్‌కు ముందు కష్టాలు తప్పేలా లేవు.
చిరంజీవి తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అయిన కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సైరా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా నరసింహారెడ్డికి ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు సైరా సినిమాపై జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు.
సైరా దర్శకనిర్మాతలు తమను మోసం చేశారని వారు ఆరోపించడంతో పాటు అక్కడే ఉండి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ వంశానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడి సినిమా చేస్తూ తమ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని తీసుకుని… తమకు న్యాయం చేస్తామని చెప్పి… ఇప్పుడు ఎలాంటి ఆర్థికసాయం చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.
సైరా రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న వేళ ఈ కంప్లెంట్ చేయడంతో ఇప్పుడు దీనికి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మెగాస్టార్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా సినిమా ఇలాంటి కష్టాల్లో పడడం మెగాస్టార్‌కు ఒకింత ఇబ్బందే.