టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో అనేక సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నడిమింటి నరసింగరావు (72) బుధవారం ఉదయం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆయన మృతికి కారణంగా తెలుస్తున్నాయి. ఇకపోతే నడిమింటి మృతికి తెలుగు చలన చిత్ర మండలి సంతాపం ప్రకటించింది.
గతంలో క్రియేటర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు నడిమింటి మాటల రచయిగా పనిచేశారు.గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలకు ఆయన రాసిన మాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలు విజయంలో సాధించడంలో నడిమింటి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.
గులాబీ సినిమాలో హీరో తెలంగాణ యాస, హీరోయిన్ ఆంధ్రా యాసలో మాట్లాడే విధానం సినీ అభిమానులకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. నేటికీ యూ ట్యూబ్, సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ మారుమోగుతూనే ఉన్నాయంటే అందుకు నడిమింటి రచనా శైలియే కారణమని చెప్పవచ్చు.