ఇంకా విషమంగానే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి

-

తెలుగు సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా పేరొందిన ఘట్టమనేని కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో సోమవారం రోజున ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 48 గంటలు కీలకమని.. అప్పటివరకు ఏమీ చెప్పలేమని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్టు ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, మరికొన్ని అవయవాలపై పడిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కిడ్నీల పనితీరు మెరుగు పరిచేందుకు డయాలసిస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇటీవల 79 ఏళ్లు పూర్తిచేసుకున్న కృష్ణ నానక్‌రాంగూడలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆయన కోడలు, మహేశ్‌బాబు సతీమణి నమ్రత, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనకు కార్డియాక్‌ అరెస్టు కావడంతో వెంటనే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) ప్రక్రియ చేపట్టారు. దాదాపు 20 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం వరకు ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి మరింత సంక్లిష్టంగా మారిందని ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి మీడియాకు తెలిపారు.

‘‘కార్డియాక్‌ అరెస్టు కారణంగా శరీర భాగాలకు రక్తసరఫరా నిలిచి ఆ ప్రభావం పలు అవయవాలపై పడింది. ఆరోగ్య పరిస్థితిని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మీరాజీరావు, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌తోపాటు న్యూరో, జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు చికిత్సలు అందిస్తున్నాం’’ అని వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news