గ్రాండ్ లెవెల్లో లాంచ్ అయిన విజయ్ దేవరకొండ – పూరి మూవీ….!!

-

టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా  రాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇక నేడు ఆ సినిమాని గ్రాండ్ లెవెల్లో ముంబై లో లాంఛ్ చేసింది సినిమా యూనిట్. ఇంకా టైటిల్ నిర్ణయం కాని ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ మాత్రం ప్రచారంలో ఉంది. పూరి కనెక్ట్స్ తో పాటు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తెలుగుతో పాటు హిందిలో కూడా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఏకకాలంలో అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కనుంది.

కాగా ఈ సినిమా ఫస్ట్ టైం అటు పూరికి, ఇటు విజయ్ కి పాన్ ఇండియా ఫిలిం కావడం విశేషం. ఇక ఈ సినిమా ద్వారా విజయ్ తొలిసారిగా తన కెరీర్ లో భారీ రేంజ్ లో ఫైట్స్ చేయనున్నాడు. అందుకోసం ఆయన ఇప్పటికే పలువురు విదేశీ యుద్ధ విద్య నిపుణుల నుండి శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక ఫేమస్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇటీవల జాన్వీ కపూర్, కియారా అద్వానీల పేర్లు కొద్దిరోజుల నుండి ప్రచారం అవుతున్నాయి, అయితే యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

 

పూరితో కలిసి నటి ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, దాదాపుగా రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తో పూరి మంచి ఫామ్ లోకి రావడం, అలానే విజయ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉండడంతో, తప్పకుండా ఈ సినిమా అందరికీ రీచ్ అయి మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది….!!

Read more RELATED
Recommended to you

Latest news