2005లో విశాల్, లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పందెం కోడి. ఆ సినిమాకు సీక్వల్ గా మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ లో పందెం కోడి-2 వచ్చింది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఏడు ఊర్లకు పెద్దగా ఉన్న రాజా రెడ్డి (రాజ్ కిరణ్) ఏడేళ్లుగా వీరభధ్రుని జాతర జరపకపోవడం వల్ల కరువు వచ్చిందని భావించి ఎలాగైనా సరే ఈసారి వీరభధ్రుని జాతర జరుపాలని నిర్ణయిస్తారు. అయితే ఏడేళ్ల క్రితం ఈ జాతరలో చిన్న గొడవ ఏకంగా ప్రాణాలు తీసునే దాకా వస్తుంది. ఆ గొడవలో భవాని (వరలక్ష్మి శరత్ కుమార్)తన భర్తని పోగొట్టుకుంటుంది. అయితే శత్రువు కుటుంబంలో వారసుడు లేకుండా చేయడమే ఆమె కర్తవ్యం ఈసారి జాతర ఉంటుందని తెలుసుకుని శత్రువు వర్గం వాడైన గోపిని చంపాలని అనుకుంటుంది ఇంతలో రాజా రెడ్డి తనయుడు బాలు (విశాల్) ఫారిన్ నుండి ఇంటికి వస్తాడు. భవాని తన పగ రాజా రెడ్డి మీద పెంచుకుంటుంది. దానితో బాలు భవానిని ఎదురిస్తాడు. ఫైనల్ గా ఆమెను ఎలా ఓడించాడు అన్నదే సినిమా కథ.
ఎలా ఉందంటే :
పందెం కోడి సీక్వల్ అనగానే సినిమా వచ్చి చాన్నాళ్లు అవుతున్నా ఆ సినిమా తాలూఖా రిఫరెన్స్ లు వెంటనే గుర్తుకొస్తాయి. ఆ సినిమా టైంలో విశాల్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. సినిమా కూడా కామెడీతో పాటుగా యాక్షన్ పార్ట్ చేశాడు. కాని ఈ సీక్వల్ అలా కాదు హీరో విశాల్ కు ఓ స్టార్ ఇమేజ్ వచ్చింది. సినిమా మీద కూడా కొన్ని అంచనాలున్నాయి. వాటిని అందుకోవాల్సి ఉంటుంది.
కథ అంత కొత్తగా అనిపించలేదు అయితే కథనం మాత్రం మాస్ ఆడియెన్స్ మెప్పించేలా తీశాడు. మొదటి భాగం మొత్తం యాక్షన్ సీన్స్ తో నడిపించిన దర్శకుడు లింగుస్వామి సెకండ్ హాఫ్ కాస్త ఎమోషన్ యాడ్ చేశాడు. ఇక సినిమా మొత్తం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు.
అయితే దర్శకుడిగా లింగుస్వామి బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఈ సినిమా ఉంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన పందెం కోడి 2 కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది.
ఎలా చేశారు :
బాలు పాత్రలో విశాల్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నిటిలో విశాల్ వీర విహారం చేశాడు. ప్రస్తుతం తెలుగు తమిళంలో మంచి ఫాంలో ఉన్న విశాల్ పందెం కోడిగా మరోసారి తన సత్తా చాటాడు. హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాలో అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ కాకున్నా సరదాగా సాగింది. ఇక సినిమాలో నటించిన వరలక్ష్మి తన నట విశ్వరూపం చూపించింది. సినిమాలో హీరోకి తగినట్టుగా వరలక్ష్మి నటన ఉంది. రాజ్ కిరణ్ కూడా బాగా చేశాడు.
కె.ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం కూడా ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు కొత్తగా ఏమి చెప్పలేదు. కాని మాస్ ఆడియెన్స్ మెప్పించేలా ప్రయత్నించాడు. జికే ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఠాగూర్ మధు నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
విశాల్, వరలక్ష్మి నటన
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
అక్కడక్కడ ల్యాగ్ అవడం
బాటం లైన్ :
విశాల్ పందెం కోడి-2.. పందెంలో గెలిచినట్టే..!
రేటింగ్ : 2.5/5