ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా, ఆ తరువాత కమెడియన్ గా, హీరోగా.. మళ్లీ కమెడియన్ గా.. ఇప్పుడు టీవీ హోస్ట్‌గా అలీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే యమలీల, ఘటోత్కచుడు లాంటి చిత్రాలు అలీ కెరీర్లో ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. అయితే ఈ మధ్యే అలీ టాలీవుడ్‌లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అలీని సీఎం చంద్రబాబు సన్మానించారు. ఈ క్రమంలోనే అలీ తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అవి మీ కోసం..!
సినిమా సెట్లలో కేవలం అగ్ర తారలకే సరైన ట్రీట్‌మెంట్ ఉంటుందని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడని.. కానీ అందులో నిజం లేదని అలీ అన్నాడు. సినిమా సెట్లలో ఎవర్నయినా ఒకే రకంగా చూస్తారన్నాడు. ఎందుకంటే తనను కమెడియన్ గా ఉన్నప్పుడు ఎలా చూశారో.. హీరోగా ఉన్నప్పుడు కూడా అలాగే చూశారన్నాడు. ఇక తన కెరీర్ లోనే భారీ హిట్‌గా నిలిచిన యమలీల సినిమా గురించి కూడా ఆలీ పలు విషయాలను వెల్లడించాడు.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హీరో మహేష్ బాబు కోసం యమలీల కథను సిద్ధం చేశారట. అదే కథను సూపర్ స్టార్ కృష్ణకు ఎస్వీ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే కథ బాగుందని కృష్ణ మెచ్చకున్నారట. కానీ మహేష్ బాబు ఆ సమయంలో సినిమా చేయడం కుదరదని కృష్ణ అన్నారట. ఎందుకంటే.. మహేష్ చదువుకుంటున్నాడని, చదువు పూర్తి కావడానికి మరో 5 సంవత్సరాలు పడుతుందని, అందుకని మహేష్‌తో సినిమా కుదరదని కృష్ణ అన్నారట. దీంతో ఎస్వీ కృష్ణారెడ్డి తన యమలీల సినిమాకు హీరో ఎవరా అని వెదుకుతుండగా, ఆయనకు అలీ అందుకు కరెక్ట్‌గా సెట్ అవుతాడని అనిపించాడట. దీంతో అలీని యమలీలకు హీరోగా ఎంపికచేశారట. అయితే అలీని హీరోగా పెట్టుకుంటే సినిమా పోతుందని, కమెడియన్‌తో సినిమా చేస్తే ఎలా ఆడుతుంది, నీ కెరీర్ దెబ్బ తింటుందని.. ఎస్వీ కృష్ణారెడ్డికి ఎవరో చెప్పారట. అయినా కథపై నమ్మకం ఉండడం వల్లే అలీకి ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారట. దాంతో ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా హిట్ అయ్యే సరికి అటు ఆయనతోపాటు తనకూ ఎంతో పేరు వచ్చిందని అలీ చెప్పాడు. అప్పటి వరకు తాను చేసిన చిత్రాలన్నీ ఒకెత్తయితే.. యమలీల సినిమా మరొక ఎత్తు అని అలీ అన్నాడు. యమలీల సినిమా తన కెరీర్ లో ఎప్పటికీ స్పెషలే అని అలీ అన్నాడు. అయితే హీరోగా పలు సినిమాల్లో నటించాక… మళ్లీ కమెడియన్ ఎందుకు అయ్యారని అడగ్గా.. అందుకు అలీ స్పందిస్తూ… అసలు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడాన్ని అదృష్టంగా భావించాలని, హీరోగా ఒక్క హిట్ పడగానే అంత తోపు ఇంక లేరు అని భావించలేదని, ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలనుకున్నానని అలీ తెలిపాడు. అందుకే ఆ తరువాత కూడా హీరోగా లేదా కమెడియన్ గా ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తున్నానని అలీ స్పష్టం చేశాడు.