ఆధ్యాత్మికం.. అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం

-

గోదావరి నదీతీరాన్న ఉంది ఈ పుణ్యతీర్థం. అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. మానవ జీవితంలో ఒక్కసారైనా అంతర్వేదికి వెళ్లాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి నరసింహుని దర్శనం చేసుకోవచ్చు.

స్థల పురాణం

ఓసారి బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయాలనే సంకల్పంతో ఈ ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ఠిస్తాడు. సూతమహాముని ఈ చరిత్రను శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందుకు ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత, లక్ష్మణ హనుమంతునితో కూడి వశిష్ఠ ఆశ్రమాన్ని, లక్ష్మినరసింహుని దర్శించుకుంటాడని, అక్కడే కొన్ని రోజులు ఉన్నట్లు శిలా శాసనాల వల్ల తెలుస్తోంది. ద్వాపర యుగంలో అర్జునుడు తీర్ధయాత్రలు చేస్తూ ‘అంతర్వేది నరసింహుని’ దర్శించినట్లు చేమకూర వేంకట కవి ‘విజయ విలాసం’లో ..కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోను వర్ణించారు.

ఆలయం చుట్టూ సుందర ప్రదేశాలే..

గోదావరి నది బంగాళఖాతంలో కలిసే సుందరమైన ప్రదేశం ఇది. సముద్రతీరాన ఆలయం దగ్గరలో వశిష్ఠ ఆశ్రమం ఉంది. నాలుగు అంతస్తుల్లో, చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో ఉంటుంది. అలాగే ధ్యానమందిరం, యోగశాల ఉన్నాయి. యాత్రికులు పర్ణశాలలో విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే అశ్వరూడాంబికాలయం ఉంది. నరసింహస్వామి రక్తావలోచనుడికి మధ్య జరిగిన యుద్ధంలో రక్తం భూమి మీద పడకుండా పార్వతి అంశతో మాయాశక్తిని నరసింహుడు సృష్టిస్తాడు. అది అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పిల్చేస్తూ అతని మరణానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఈ మాయాశక్తి అశ్వరూడాంబికగా వెలిసింది.

ఎలా చేరుకోవాలి?

అంతర్వేదికి చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సఖినేటిపల్లి చేరుకోవచ్చు. లేదా నరసాపూర్‌ నుంచి గోదావరి పాయ పడవలో దాటి సఖినేటి పల్లి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు.

మంగళవారం (23న) స్వామివారి కల్యాణోత్సవం

ఆలయానికి అభిముఖంగా కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి ఉభయదేవేరులతో కలిపి కల్యాణాన్ని నిర్వహిస్తారు. కనువవిందైన ఈ దృశ్యాన్ని తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి కల్యాణం జరిగిన తర్వాతే ఇక్కడ కల్యాణాలు జరుగుతాయి. ప్రతిఏటా మాఘశుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యబి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ దశమి రోజు స్వామివారి కల్యాణం, ఏకాదశినాడు రథోత్సవం జరుగుతుంది. వైశాఖమాసంలో శుద్ధ చతుర్ధశినాడు లక్ష్మినరసింహుడి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎంతటి కష్టలనైనా స్వామివారిని దర్శించుకుంటే సమసిపోతయాని అంటారు. సంతానం లేని వారు లక్ష్మినరసింహుని దర్శించుకుని, ఆ రాత్రి స్నానం చేసి తడి బట్టలతో అక్కడ నిద్రచేస్తారు. కలలో చిన్నబొమ్మలు, పిల్లలు వస్తే వారికి సంతానయోగం కలుగుతుందని భక్తుల నమ్మకం.

 

Read more RELATED
Recommended to you

Latest news