ఏపీ బీజేపీ పై అధిష్టానం ఫైర్ అవుతుంది అందుకేనా

-

ఏపీలో తెరపైకి వస్తున్న పలు రకాల సమస్యలు రాష్ట్ర బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు బడ్జెట్ నుంచి ఇటు స్టీల్ ప్లాంట్ వరకు అందరూ కేంద్రం తీరుపై భగ్గుమంటున్నారు. వాటికి సమాధానం చెప్పలేక.. సర్దిచెప్పుకోవడానికి రాష్ట్ర కమలం నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వద్దకు వచ్చిన ఏపీ నేతల కు ఏం చెప్పారు..నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు ఎందుకు మండిపడుతున్నారు అన్న దాని పై ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి.

సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడైన తరువాత కొన్ని కార్యక్రమాలతో దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఆయన అందరినీ కలుపుకు వెళ్లడం లేదనే చర్చ మొదలైంది. తరువాతి కాలంలో కొందరికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, మరికొందరికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి పార్టీలో అగ్గిరాజేశాయి. దీంతో రాష్ట్రంలో పార్టీ పోకడలపై ఢిల్లీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయట. రాష్ట్రంలో పలు అంశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. తమకు వచ్చిన ఫీడ్ బ్యాక్, ఫిర్యాదులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి సమస్యలు పెండింగ్‌లో ఉండగానే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం బీజేపీని మరోసారి ఇరుకునపడేసింది. ప్లాంట్ విషయంలో వచ్చే కష్టాన్ని, నష్టాన్ని ముందే గ్రహించిన పార్టీ నేత మాధవ్ వెంటనే రంగంలోకి దిగి కేంద్ర పెద్దలను కలిశారు. నిర్మాలా సీతారామన్ తో సహా ముఖ్యులను కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో పలు ప్రతిపాదనలు అందజేశారు. అయితే ఇక్కడ ఉద్యమం తీవ్రత పెరగడంతో.. ఏపీ నుంచి ముఖ్యనేతల బృందం అంతా కలిసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కక తప్పలేదు.

సోము వీర్రాజు నేతృత్వంలోని మఖ్యనేతలు.. ఉక్కుశాఖ మంత్రితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోనూ కొద్దిసేపు మాత్రమే భేటీ కాగలిగారు. అయితే వీరు వెళ్లిన ప్రతిచోటా ఈ బృందానికి తీవ్ర నిరాశే ఎదురైందని సమాచారం. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్ర ఒక పాలసీ డెసిషన్ తీసుకుందని..ఇలా ప్రతి అంశానికి అడ్డుచెబితే కుదరదని తేల్చి చెప్పారట. పైగా రాష్ట్ర పార్టీపై వస్తున్న ఫిర్యాదులు, పోకడలపై ఢిల్లీ పెద్దలు కూడా అసహనంతో ఉన్నారట. దీంతో స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ వెళ్లిన వారికి పెద్ద క్లాస్ పడినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.

అందరూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంవైపే వేలెత్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని కవర్ చేసుకునే పనిలో పడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు. అసలు స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నట్లు ఎవరు చెప్పారంటూ ఎదరుదాడి మొదలు పెట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చిన్న ట్వీట్‌కే ఎందుకింత రచ్చ చేస్తున్నారంటున్న బీజేపీ నేతలు.. మీరెందుకు ఢిల్లీ వెళ్లారు అంటే మాత్రం చాలా అంశాలే ఉన్నాయంటున్నారు. అయితే స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం ఏం చెప్పింది అనేది మాత్రం స్పష్టం చెయ్యలేకపోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ టూర్ అంతా సాఫీగా సాగలేదని ఏపీ బీజేపీ నేతల మధ్య చర్చ జరగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news