ప్రతి ఒక్కరు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రదక్షిణ చేసి ఉంటారు. ఏ దేవాలయంలో చూసిన ప్రతిరోజు అనేక మంది భక్తులు మూడు నుంచి మొదలుపెడితే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ప్రదక్షిణలు చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…
ప్రదక్షిణం అంటే తిరగడం అని అర్థం. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని శాస్ర్తాలు పేర్కొన్నాయి.
ప్ర – ప్రదక్షిణం చేయడానికి మీ కాళ్ళు కదులుతూంటే మీ పాపములు తొలిగిపోతాయి.
ద – మీరు ఏ కోరికల కోసం చేస్తున్నారో ఆ కోరికలు నెరవేరుతాయి
క్షి – మీరు ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణం చేస్తే, జన్మ జన్మాంతరములందు చేసిన పాపాలు పోతాయి.
ణం – ఆఖరి ఉపిరి దగ్గర పాపం లేనటువంటి మోక్ష స్థితిని లభిస్తుంది.
పరమార్థం
సకల చరాచర విశ్వంలో చైతన్యశక్తి అంతా ప్రతి క్షణం పరిభ్రమిస్తూనే ఉంటుంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు నిత్యం ప్రదక్షిణం చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తున్నాయి. విశ్వాంతరాళంలో వివిధ నక్షత్ర మండలాలు నిత్యం ప్రకాశించేవి.. పరిభ్రమ శక్తివల్లనే. గ్రహాలతో గ్రహించబడిన శక్తితోనే గ్రహచర జీవులు చైతన్యవంతమవుతున్నాయి. సూర్యుని చుట్టూ చేసే ఒక ప్రదక్షిణ ఓ విధంగా శక్తిని పరిగ్రహించే ప్రదక్షిణ. అనంతవిశ్వంలోని అణువణువూ ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని అది అందించే శక్తితోనే పరిభ్రమిస్తుంది.
ప్రదక్షిణం వలన మాత్రమే గ్రహాలు సుస్థిరమైన స్థానం కల్పించుకోగలుతున్నాయని చెప్పవచ్చు. జననం నుంచి మరణం వరకు ఒక ప్రదక్షిణ ఎన్నో ఆవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాలను అనుభవించడమే.. వాని దుష్ఫలితాలను తొలగించుకోవాలని తాపత్రయపడటమే.. ప్రదక్షిణ పరమార్థం. ఆలయంలోని దైవశక్తి విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం. విశ్వంలో ప్రదక్షిణ చేయడం కుదరదు కనుక.. విశేశ్వరుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వానికి చేసే ప్రదక్షిణంగా భావించవచ్చు. ఇక ఆలస్యమెందుకు అర్థం, పరమార్థం తెలుసుకున్నారు కదా.. మీమీ కామ్యాలను నెరవేర్చుకోవడానికి ఆయా దేవుళ్ల కృప కోసం ప్రదక్షిణలు చేయండి.
– కేశవ