అన్ని జన్మలలో ఏది ఉత్తమమైనది? జన్మలు ఎలా వస్తాయి?

-

జన్మలు 3 రకాలు..!
1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.

జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. క్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అవకాశం లేదు.
అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే సరిస్థితి అక్కడ ఉండదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే… “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని… మానవ లోకాన్ని చేరుకోవలసిందే! మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!

ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ. ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి . కారణం, ఈ జంతుజన్మలలో శరీరం – మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.

కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అవకాశం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ ఇది.

కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను..“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సత్యనిష్ట, పరోపకారబుద్ధి, పాపభీతి, దైవభక్తి, ప్రేమ, విశ్వాసం, నమ్మకాలు కలిగివుండి తన ధర్మాన్ని తాను సక్రమంగా ఆచరిస్తే చాలు. వీటిని మనుషులు అనుసరించడానికి వీలుగానే భగవంతుడు రామావతారమెత్తి, మానవుడు ఎలా ఉండాలో లోకానికి నేర్పాడు.

– నల్లపురి హరికృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news