విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విషవాయువు ఘటన మే 7న రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని సైతం కుదిపేసింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. స్పాట్‌లో 12 మంది తర్వాత ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఈ విషయం రాజకీయంగా కూడా వివాదానికి దారితీసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొన్ని రోజుల పాటు దీనిని రాజకీయం చేసింది. జగన్ వైఖరిపై దుమ్మెత్తి పోసింది. ఎల్జీ కంపెనీతో జగన్ కుమ్మక్కయ్యారని.. అందుకే స్టైరిన్‌ను రాష్ట్రం నుంచి దొడ్డిదారిలో అనుమతులు ఇచ్చి పంపేశారని కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది. ఈ నెలలో మహానాడును నిర్వహించాల్సి వచ్చినప్పుడు.. హైదరాబాద్ నుంచి చంద్రబాబు విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తొలుత విశాఖ వెళ్లి.. అక్కడ ఎల్జీ పాలి మర్స్ బాధితులను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ రోజు దేశ వ్యాప్తంగా ప్రయాణించాల్సిన విమానాలను కేంద్ర విమానయాన శాఖ రద్దు చేసింది. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. అనంతరం నాలుగు రోజుల తర్వాత నేరుగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చారు. ఇక్కడ మహానాడు పూర్తి చేసుకుని మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. దీనినే వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాయింట్ అవుట్ చేశారు.
విశాఖ ఎందుకు వెళ్లలేదు బాబూ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నేతలు ఫుల్ సైలెంట్ అయిపోయారు. అయితే, దీనిపై తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. ఢిల్లీ నుంచి చంద్రబాబు కు సందేశం అందిందని, విశాఖ వెళ్లి ఎల్జీ విషయాన్ని రాజకీయం చేయద్దని కూడా ఆయనకు సూచనలు అందాయని అందుకే బాబు సైలెంట్ అయిపోయారని తెలిసింది. ఇక ఇదే విషయంలో బీజేపీని కూడా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసిందని కన్నా కూడా మౌనం వహించారని అంటున్నారు. మొత్తంగా టీడీపీ విశాఖ పర్యటన వాయిదా వెనుక చాలానే జరిగిందని తెలుస్తోంది.