నా దృష్టిలో ఆధ్యాత్మికత – జావేద్‌ అఖ్తర్‌

-

జావేద్ అఖ్తర్ అనే నా పేరుతో మైమరచిపోకండి. నేనిక్కడ ఏ రహస్యం విప్పబోవడం లేదు. రచనలోనో, టెలివిజన్ మీదనో బహిరంగంగా నేను అనేకసార్లు చెప్పిన విషయమే మళ్ళీ చెపుతున్నాను. నేను నాస్తికుడిని. నాకు ఏ మతంలోనూ విశ్వాసం లేదు. అందువల్ల ఏవిధమైన ఆధ్యాత్మికతలోనూ నమ్మకం లేదు.

జావేద్‌ అఖ్తర్‌.. పరిచయం అక్కర్లేని పేరు. అంశంపై ప్రఖ్యాత హిందీ, ఉర్దూ కవి. జావేద్ నాటక రచయిత, హిందీ సినిమాలకు వేల పాటలను, మాటలను అందించినవాడు. సమకాలీన సాహిత్యంపై ఎంతో పట్టున్నవాడు. అన్ని మత గ్రంథాలు, చరిత్రలు, పురాణాలు, నాగరికతలను ఔపోసన పట్టిన నిత్య విద్యార్థి. ఇటీవలే ఇండియా టుడే పత్రిక ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో “ఆధ్యాత్మికత ” అనే అంశంపై జావేద్ అఖ్తర్ చేసిన ప్రసంగానికి స్వేచ్ఛానువాదం ఇది. ఆధ్యాత్మికత గురించి మతాలకతీతంగా, తన భావనను సుస్పష్టంగా వ్యక్తీకరించబడిన ఈ ప్రసంగపాఠం ‘మనలోకం’ పాఠకులకు ప్రత్యేకం. ఏమాత్రం మాతృకలోని భావం చెడకుండా ఈ ప్రసంగాన్ని అద్భుతంగా అనువదించిన మిత్రులు మలసాని శ్రీనివాస్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

Javed Akhtar seminar on spirituality in India Today national session in Delhi

మహానుభావులు ఎందరో ఉన్న ఈ సభలో నేను ఉన్న స్థానంలోకి రావాలని ఎవరూ కోరుకోరనుకుంటాను. ఎందుకంటే శ్రీశ్రీ రవిశంకర్ లాంటి జనాకర్షణగల శక్తిమంతులైన ఆధ్యాత్మిక గురువు మాట్లాడిన తర్వాత మాట్లాడబోవడం, సచిన్ టెండూల్కర్ అద్భుతంగా సెంచరీ చేసిన తర్వాత ఆడడానికి నాలాంటి వాడు రావడం లాంటిది. కానీ,ఏదో ఒక బలహీన క్షణంలో నేనేనిక్కడ మాట్లాడడానికి ఒప్పుకున్నాను.

మొట్టమొదటనే నేను స్పష్టం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. జావేద్ అఖ్తర్ అనే నా పేరుతో మైమరచిపోకండి. నేనిక్కడ ఏ రహస్యం విప్పబోవడం లేదు. రచనలోనో, టెలివిజన్ మీదనో బహిరంగంగా నేను అనేకసార్లు చెప్పిన విషయమే మళ్ళీ చెపుతున్నాను. నేను నాస్తికుడిని. నాకు ఏ మతంలోనూ విశ్వాసం లేదు. అందువల్ల ఏవిధమైన ఆధ్యాత్మికతలోనూ నమ్మకం లేదు. ఎటువంటిదైనా సరే. ఇంకో విషయం కూడా చెప్పాలి. నేనిక్కడ కూచున్న పెద్ద మనిషిని విమర్శించడానికో, విశ్లేషించడానికో, విరుచుకుపడడానికో కూడా నిలబడలేదు. ఆయనకు, నాకు మధ్య ఆహ్లాదకరమైన,మర్యాదపూర్వకమైన సంబంధం ఉంది. ఆయన ఇతరులతో ఎంత సాదరంగా ఉంటారో చాలా సార్లు గమనించాను. కానీ,నేను మాట్లాడదల్చుకున్నది ఒక భావం గురించి. ఒక వైఖరి గురించి. ఒక మానసిక స్థితి గురించి మాత్రమే. ఒక మనిషి గురించి కాదు. ఈ సమావేశం ప్రారంభమైనప్పుడు నేనేమన్నారాకూడని స్థలానికి వచ్చానా అని నాకు ఒక క్షణం అనుమానం వచ్చింది. ఎందుకంటే మనం కృష్ణుడో, గౌతముడో, కబీరో, వివేకానందుడో చెప్పిన తత్వ శాస్త్రం గురించి చర్చించడానికి ఇక్కడకి వచ్చినట్టయితే, నేను మాట్లాడవలసింది ఏమీలేదు. నేనిప్పటికిప్పుడు కూచోవచ్చు. భారతీయులలో ప్రతి ఒక్కరూ గర్వంగా భావించే ఉజ్వల గతం గురించి చర్చించడానికి నేనిక్కడికి రాలేదు. నేనిక్కడికి మన సందేహాస్పద వర్తమానం గురించి మాట్లాడడానికి వచ్చాను.

నన్నిక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడడానికి ఆహ్వానించారు. అయితే ఈ ఆధ్యాత్మికత అనే మాటతో మనం గందరగోళానికి గురికావద్దు. ఎందుకంటే,ఒకే పేరు గల ఇద్దరు మనుషులు ఉండవచ్చు,ఆ ఇద్దరూ పూర్తిగా భిన్నమైన వారు కావచ్చు. రామచరిత మానస్ అనే గ్రంథాన్ని తులసిదాస్ రాశాడు. రామాయణం ఆధారంగా రామానందసాగర్ ఒక టెలివిజన్ చిత్రం తయారు చేశాడు. రెండిటికీ రామాయణమే మూలం. కానీ,తులసిదాస్‌ను, రామానందసాగర్‌ను ఒకేలా చూడడం అంత ఉచితమని నేను అనుకోను. రామచరిత మానస్ రాసినప్పుడు తులసిదాస్ పై సాంఘిక బహిష్కరణ విధించారు. అంత పవిత్రమైన గ్రంథాన్ని అవధీ లాంటి మామూలు ప్రజల భాషలో రాసి అవమానిస్తాడా అని ఆయన మీద విరుచుకుపడ్డారు. మతఛాందసవాదులు ఏ మాటలు మాట్లాడినా,ఏ రంగులో ఉన్నా, ఏ మతానికి చెందినా, అంతా ఒకేలా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. 1789లో షా అబ్దుల్ ఖాదర్ అనే ఒక పెద్ద మనిషి ఈ నగరం(ఢిల్లీ)లోనే మొట్టమొదటి సారి ఖురాన్ ను ఉర్దూలోకి అనువాదం చేశాడు.

ఆ కాలంలో అధికారం చెలాయిస్తున్న ఉలేమాలందరూ ఆయన మీద ఫత్వా విడుదల చేశారు. పవిత్ర గ్రంథాన్ని అలగా జనం భాషలోకి అనువాదం చేయడం దైవ ద్రోహం అన్నారు. రామచరిత మానస్ రాసి బహిష్కరణకు గురైన తర్వాత తులసీదాస్ నాలుగు పాదాల పద్యం ఒకటి రాశాడు.

“దూత్ కహో అవదూత్ కహో. రాజ్‌పుత్ కహో కి జులావా కహు, కోహూకి బేటీ సే బేటా నా బియాహబ్ కోహూకి జాత్ బిగాడ్ నా చాహు మాంగ్ కే ఖైబో మహజిద్ మే రైబో లేబేకో ఏక్ నా దేబే కా దోహు”

Javed Akhtar seminar on spirituality in India Today national session in Delhi

మరొక వైపు రామాయణ టెలివిజన్ సీరియల్ తయారు చేసి రామానంద్ సాగర్ కోట్ల రూపాయలు ఆర్జించాడు. నేనేమీ ఆయనను చిన్నబుచ్చడం లేదు. కానీ, చివరిమెట్టుపై ఉన్నాడని మాత్రం చెప్పక తప్పదు. మరొక ఉదాహరణ చెప్తాను. బహుశా అది మరింత సరళమూ, సరైనదీ అనుకుంటాను. గౌతముడు రాజాంతఃపురాన్ని వదిలి అడవిలోకి వెళ్ళింది సత్యాన్ని అన్వేషించడానికి. కానీ ఈరోజుల్లో మీరు చూస్తే ఈ ఆధునిక కాలపు గురువులు అడవుల్లో నుంచి బయటకు వచ్చి రాజప్రాసాదాలలో చేరిపోతున్నారు.వీళ్ళు పూర్తిగా ప్రతికూలదిశలో నడుస్తున్నారు. కనుక గౌతముడి గురించీ, వీళ్ళ గురించీ ఒకేలాగా మాట్లాడలేం. అందువల్ల భారతీయులందరికీ ప్రియమైన, గౌరవనీయమైన పేర్ల వెనుక దాక్కొన విషయాలు మాట్లాడాలి.

నన్నిక్కడ మాట్లాడమని ఆహ్వానించినపుడు నేను నాస్తికున్శి కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా హేతుబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నన్నిక్కడకు పిలిచారనుకుంటున్నాను. కానీ హఠాత్తుగా నాకు ఇంకో విషయం తట్టింది. ఈ ఆధునిక గురువులకూ, నాకూ ఒక సాపత్యం ఉంది. నేను సినిమాల్లో పనిచేస్తాను. వాళ్ళకూ నాకూ ఉమ్మడి అంశం ఏమిటంటే మేమిద్దరమూ కూడా కలలు అమ్ముతాం. ఇద్దరమూ కూడా భ్రమలను సృష్టిస్తాం. ఇద్దరమూ గొప్ప చిహ్నాలను తయారు చేస్తాం. ఒక చిన్న తేడా మాత్రం ఉంది. మూడు గంటలు గడవగానే మా కలల అమ్మకం ఆపేసి శుభం అని కార్డు వేసి మీ ప్రపంచంలోకి వెళ్ళిపోండి అని జనాన్ని పంపించేస్తాం. ఈ గురువులు మాత్రం అలా ఎప్పటికీ పంపరు.

కనుక ఇక్కడ ఇవాళ ప్రపంచపు సూపర్ మార్కెట్లో ఒక అమ్మకపు వస్తువుగా మారిపోయిన ఆధ్యాత్మికత గురించి మాట్లాడడానికే నేనిక్కడ నిలబడ్డానని స్పష్టం చేయదలిచాను. ఇవాళ ప్రపంచంలో మూడు పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. అవే ఆయుధాలు, మాదకద్రవ్యాలు,ఆధ్యాత్మికత. అయితే ఆయుధాలలోనూ,మాదకద్రవ్యాలలోనూ మీరు ఎంతో కొంత చేయాలి. ఏదో ఒకటి ఇవ్వాలి. తేడా ఏమంటే ఆధ్యాత్మికతలో మాత్రం మీరేమీ ఇవ్వనక్కరలేదు.

ఈ సూపర్ మార్కెట్ లో మీకు అడిగిన వెంటనే అలౌకికానందం దొరుకుతుంది.మెయిల్ లో మీకు మోక్షం చేరుతుంది. ఆత్మ సాక్షాత్కారంలో క్రాష్ కోర్సు ఉంటుంది. నాలుగు సులభ పాఠాలలో విశ్వచైతన్యం అందుతుంది. ఈ సూపర్ మార్కెట్ కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలలో అశాంతి నిండిన ఉన్నత వర్గాలూ, సంపన్న వర్గాలూ ఆధ్యాత్మికత ఫాస్ట్ ఫుడ్ కొనుక్కుని తింటూనే ఉంటాయి. నేనిప్పుడు ఈ ఆధ్యాత్మికత గురించి మాట్లాడదలిచాను.

ప్లేటో సంభాషణల్లో ఆయన చాలా విలువైన విషయాలు ఎన్నో చెప్పాడు. వాటిలో ఒకటి ఏమంటే, ‘మీరు ఏదైనా చర్చ ప్రారంభించే ముందు మీరు వాడుతున్న పదాల అర్థం ఏమిటో నిర్ణయించుకోండి’ అని. మరి మనం కూడా ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అనే పదం అర్థం ఏమిటో నిర్ణయించుకుందాం. ఆ పదానికి అన్ని మతాలనూ,కులాలనూ,ముఠాలనూ,జాతులనూ అధిగమించి సంపూర్ణంగా మానవజాతి పట్ల ప్రేమ అనే అర్థం ఉంటుందా? అలా ఉంటే నాకేమీ సమస్య లేదు. కాకపోతే, దాన్ని నేను ఆధ్యాత్మికత అనే బదులు మానవత అంటాను. లేదా, దానికి అర్థం మొక్కలనూ,చెట్లనూ, కొండలనూ,

సముద్రాలనూ, నదులనూ, జంతువులనూ ప్రేమగా చూడడం అనా? అంటే, మానవేతర ప్రపంచం పట్ల దయ కలిగి ఉండడమనా? ఒకవేళ అదయినా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే దాన్ని నేను ఆధ్యాత్మికత అనను. పర్యావరణ చైతన్యం అంటాను. లేదా, వివాహం , మాతృత్వం, పితృత్వం, కళలు, న్యాయవ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి సామాజికాంశాలను హృదయపూర్వకంగా గౌరవించడమే ఆధ్యాత్మికత అనే మాటకు అర్థమా? అయ్యా, అప్పుడు కూడా నాకేమీ సమస్య లేదు. అసలు నాకు అనంగీకారం తెలిపే అవకాశమే లేదు. కానీ, నేను దాన్ని పౌర బాధ్యత అంటాను. లేదూ ఆధ్యాత్మికత అంటే మీ లోకంలోకి మీరు వెళ్ళిపోయి,మీ సొంత జీవితపు అర్థం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేయడమా? దానికి ఎవరు అడ్డు చెపుతారు? కానీ దాన్ని నేను ఆత్మపరిశీలన, ఆత్మ పరీక్ష అనుకుంటాను.లేదూ ఆధ్యాత్మికత అంటే యోగం అని అర్థం చెపుతున్నారా? గౌరవనీయుడైన పతంజలి యోగ శాస్త్రానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన యోగం,యమ,యాతం,ఆసన,ప్రాణాయామ వంటి వివరాలు ఎన్నో మనకందించాడు. వాటికి మనం ఇవ్వాళ ఏ పేరైన పెట్టుకోవచ్చు. కానీ ప్రాణాయామం చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని నేను ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం అంటాను.

ఇదంతా పదాల గారడీగా కనిపిస్తుందా? ఒకవేళ ఇదే ఆధ్యాత్మికత అయితే ఇక చర్చకు అవకాశమేముంది? నేను వాడిన పదలూ,అర్థాలూ అన్నీ కూడా సంపూర్ణంగా గౌరవించదగినవి. ఆమోదించదగినవి. వాటిలో అమూర్తమైనదేదీ లేదు. మన చూపులకు అందనిదేది లేదు. మరి ఆధ్యాత్మికత అనే మాట పట్టుకుని ఎందుకంతగా వేళ్ళాడుతున్నారు?నేను చెప్పిన మాటలలో వ్యక్తం కాని ఏ భావాన్ని ఈ ఆధ్యాత్మికత అనే మాట సూచిస్తోంది? నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా ఉందా? ఉన్నట్టయితే అది ఏమిటి?

ఆ మాట వాడినంత మాత్రాన నీకు వచ్చిన సమస్య ఏమిటి అని ఎవరైనా నన్ను ఎదురు ప్రశ్నించవచ్చు. ఆ మాటను మార్చమనీ, ఒదిలేయమనీ, పారేయ్యమనీ, దానికి కాలం చెల్లిందనీ అంటున్నాను. ఎందుకు? నా అభ్యంతరం ఏమిటో చెపుతాను. ఆధ్యాత్మికత అంటే అర్థాలు నేను చెప్పినవే అయితే చర్చకు అవకాశమే లేదు. కానీ నన్ను ఇబ్బంది పెట్టే అంశం మరొకటి ఉంది. ఏ నిఘంటువు అయినా తెరిచి చూడండి. ఆధ్యాత్మికత అనే మాట ఆత్మ అనే మాట నుంచి పుట్టింది.

మానవజాతికి ఈ భూగోళం గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా తెలియనప్పుడు మనుషులు తమను తాము రెండు అంశాల సమ్మేళనంగా ఊహించుకున్నారు. ఒకటి శరీరం మరొకటి ఆత్మ. శరీరం అనేది తాత్కాలికమనీ, అది మరణిస్తుందనీ, కానీ ఆత్మ అనేది ఎన్నటికీ నాశనం లేనిదని ఊహించుకున్నారు. మీ శరీరం లోపల మీకొక కాలేయం ఉంది. ఒక గుండె ఉంది. పేగుల చుట్ట ఉంది. ఒక మెదడు ఉంది. ఈ మెదడు అనేది శరీరంలో భాగం కనుక,మనస్సు అనేది మెదడు వల్ల తయారవుతున్నది కనుక, ఇవన్నీ తక్కువ జాతివే అని వాళ్ళనుకున్నారు. శరీరంతో పాటు చివరికి మెదడు కూడా చచ్చిపోతుందని వాళ్ళు తెలుసుకున్నారు.

కానీ, భయం లేదు. మీరు ఎప్పటికీ చచ్చిపోరు. ఎందుకంటే,మీరంటే మీ ఆత్మ. ఆ ఆత్మ ఒక అత్యున్నత చైతన్యంతో ఎల్లకాలం నిలిచి ఉంటుంది. మీకు వచ్చే సమస్యలన్నీ మీ మనస్సు చెప్పే మాటలు వినడం వల్ల వస్తున్నాయి. మనస్సు చెప్పే మాటలను వినడం మానెయ్యండి. ఆత్మ చెప్పే మాటలు వినండి. ఆ అత్యున్నత చైతన్యానికి విశ్వాంతరాళమైన సత్యం అవగాహనలో ఉంటుంది. ఇదీ కథ. సరే,పూనాలో ఒక ఆశ్రమం ఉంది. నేను అక్కడికి వెళుతూ ఉండేవాణ్ణి. ఎందుకంటే,అక్కడ మాట్లాడేవాళ్ళు మంచి వక్తలు. ఆ సమావేశ మందిరం ద్వారం దగ్గర ఒక హెచ్చరిక రాసి ఉండేది. ” మీ చెప్పులూ,మనస్సూ ఇక్కడ వదిలేసి వెళ్లండి “. అయితే ఇటీవల కొందరు గురువులు మీరు చెప్పులతో వచ్చినా అంగీకరిస్తున్నారు. కానీ,మనస్సులతో రావడానికి మాత్రం ఎంతమాత్రం వీల్లేదు.

మరి, మీరు మనస్సును వదిలేస్తే ఏం చేస్తారన్నమాట? అప్పుడిక చైతన్యంలో మరొక అడుగు ముందుకు వేయడానికి మీకొక గురువు అవసరం అవుతాడు. ఆ చైతన్యపు మరొక మెట్టు ఆత్మలో దాగి ఉంటుంది. ఈ గురువుగారు ఉన్నత చైతన్యం సాధించారు. ఆయనకు అత్యున్నత సత్యం తెలుసును. కానీ, మీకాయన ఊరికే ఇచ్చేస్తారా? లేదండి. ఆయన అది మీకు వెంటనే చెప్పలేరు. పోనీ మీ అంతట మీరు ఆ మెట్టు ఎక్కి అది అందుకోగలరా? లేదండి. ఆ పని చేయడానికి మీకు గురువు సహాయం అవసరం అవుతుంది. మీకు ఆయన కావలసిందే. అయినా మీరు అంతిమ సత్యాన్ని అందుకోగలరని ఆయన హామీ ఇవ్వలేడు….సరే, ఇంతకీ ఆ అంతిమ సత్యం అనేది ఏమిటి? విశ్వ సత్యం అనేది ఏమిటి? అది విశ్వం గురించిన సత్యమా? నాకు అదేమీ అంతుపట్టదు. సౌర మండలం నుంచి ఒక అడుగు బయట పెడితే మొట్టమొదట మనకు కనబడే నక్షత్రం పేరు ఆల్ఫా సెంచూరి. అది మనకు నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికీ నాకూ సంబంధం ఎలా ఏర్పడుతుంది? ఏర్పడకపోతే నేను ఏం చేయను?

అసలు విషయం ఏమంటే , చక్రవర్తిగారు మేధావులకు మాత్రమే కనబడే దుస్తులు ధరించారు.అంతేకాదు, రారాజు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అలాగే మేధావుల సంఖ్యా పెరుగుతోంది.

మతాధిపతులకు రెండో రక్షణ కవచంగానే ఈ ఆధ్యాత్మికత అనేది పనికొస్తుందని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి. సంప్రదాయ మతం గురించి వాళ్లు ఇబ్బందిపడుతున్నాప్పుడు,దాని పరిస్థితి మరీ ఆశాజనకంగా లేనప్పుడు వాళ్ళకు ఈ విశ్వం,మహాచైతన్యం లాంటి పొగల పొరల వెనుక దాగవలసిన అవసరం వస్తుందని అనుకునేవాణ్ని. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే,సంప్రదాయ మతాన్ని నమ్మేవారు, ఆధ్యాత్మికతను నమ్మేవారు పూర్తిగా వేరు వేరు. ఒకసారి ప్రపంచ పటాన్ని తీసుకోండి. అతి ఎక్కువగా మతప్రభావం ఉన్న ప్రాంతాలు గుర్తిస్తూ పోండి. భారతదేశంలో గానీ, భారతదేశానికి బయటగానీ ఆసియాలో, లాటిన్ అమెరికాలో,యూరప్ లో ఎక్కడైనా…ఎక్కడెక్కడ అయితే మతప్రభావం ఎక్కువ ఉందో, అక్కడల్లా మానవ హక్కులు కొరవడుతున్నాయని మీరు గుర్తిస్తారు. అక్కడంతా అణచివేతే ఉంది. ఎక్కడైనా సరే. మతం అంటే పేద ప్రజల పాలిట మత్తు మందూ అనీ, అణగారిన ప్రజల నిట్టూర్పు అనీ మన మార్క్సిస్టు సన్నిహితులు అంటూ ఉండేవాళ్ళు. నేనిప్పుడు ఆ చర్చలోకి వెళ్లను గానీ, ఇవాళ మాత్రం ఆధ్యాత్మికత అనేది తప్పనిసరిగా ధనికులు వినియోగిస్తున్న ఒక మత్తుపదార్థం. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికతను నమ్మే సమూహం అంతా సంపన్నవర్గం మాత్రమే. అంటే, గురువుగారికి అధికారం వస్తుంది, చాలా గౌరవం దక్కుతుంది, హోదా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది ( అది ముఖ్యం కాదని వాళ్ళంటారనుకోండి) మొత్తం మీద అధికారమూ, సంపద దక్కుతాయి. మరి శిష్యుడికి ఏం దొరుకుతుంది? చాలా మంది శిష్యులను నేను జాగ్రత్తగా గమనించాను. ఈ శిష్యులలో వేరు వేరు రకాల వారున్నారు. అందరూ ఒక్కలాంటి వాళ్ళు కారు.

విభిన్నమైన వర్గాల అనుయాయులు ఉన్నారు. భిన్నతరహా శిష్యులు ఉన్నారు. ఒక శిష్యుడు ధనవంతుడు. ఎన్నో విజయాలు సాధించినవాడు. జీవితంలో చాలా పైకి వచ్చినవాడు. విపరీతంగా ధనం సంపాదిస్తున్నవాడు. ఆస్తి పోగేస్తున్నవాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కనుక ఇక ముక్తి కావాలి. అందువల్ల గురువుగారు ఏం చెపుతారంటే, ‘నువ్వు ఏం చేస్తున్నా సరే అదంతా నిష్కామకర్మ .నువ్వు కేవలం నీ పాత్ర పోషిస్తున్నావు. ఇదంతా మాయ. నువ్వు రోజు రోజూ పోగుచేసుకుంటున్న డబ్బు, నువ్వు కూడబెడుతున్న ఆస్తి ఇదంతా మాయ. దీనంతటితోనూ నీకు భావోద్వేగసంబంధమేమి లేదు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావో తెలుసా? నువ్వు ఇక శాశ్వత సత్యపు అన్వేషణలో ఉన్నావు. నీ చేతి నిండా మురికి ఉంటే ఉండవచ్చు. కానీ, నీ ఆత్మ, అంతరాత్మ పరిశుద్ధమైనది’. ఈ మాటలతో ఈ శిష్యుడు తన గురించి తాను పొంగిపోతూ ఉంటాడు. అద్భుతమైన మనిషిని అనుకుంటాడు. వరుసగా ఏడు రోజుల పాటు ప్రపంచాన్ని వాడేసి, ఏడో రోజు చివరన వెళ్లి గురువు పాదాల దగ్గర కూచుని ‘అబ్బా, నేనెంత సున్నితమైన వ్యక్తిని’ అని అనుభూతి పొందుతాడు.

ఇంకొక రకం ఉన్నారు. వీళ్ళు కూడా సంపన్నవర్గం నుంచే వస్తారు. కానీ, వీళ్ళు మొదటిరకం లాగా విజయసాధకులు కారు. విజయం సాధించడమైనా, వైఫల్యం చెందడమైనా సాపేక్షికమని మీకు తెలుసు. రోడ్డు పక్క పేవ్ మెంట్ జూదం ఆడే రిక్షావాలా వంద రూపాయలు సంపాదిస్తే మహా విజయం సాధించానని అనుకుంటాడు. ఒక కార్పొరేట్ సంపన్నుడు ముప్పై కోట్ల డాలర్లు సంపాదించాక, అతని సోదరుడు వంద కోట్లు సంపాదించాడని, అందువల్ల తాను పనికిమాలిన వాడినవి అనుకుంటాడు. ఇలా తనకు తాను పనికిమాలిన వాడినవి అనుకున్న ధనికుడు ఏం చేస్తాడు? అతనికి తక్షణమే ఒక గురువు కావాలి. ఆ గురువు హితబోధ చేస్తాడు. నువ్వు విఫలం అయ్యావని ఎవరన్నారు? నీకు వేరే లోకాలు ఉన్నాయి. నీకు వేరే దృష్టి ఉంది. నీ సోదరుడికి లేని ఊహలు నీకు ఉన్నాయి. నీ సోదరుడు విజయం సాధించాడని అనుకుంటున్నావేమో. తప్పు. ఈ ప్రపంచం క్రూరమైనది.నీకు తెలుసు. ఈ ప్రపంచం నిజాయితీగా నీకు చెపుతుంది. అయ్యా, పది సంపాదించవలసి ఉండగా మీరు మూడే సంపాదించారు. మరొక వ్యక్తి పదింట ఏడు సంపాదించాడు. లోకం నిన్ను అలా చూస్తుంది. నీకు తెలిసిన వాళ్ళందరూ నిన్ను అట్లాగే చూస్తారు. ఇటువంటి హితబోధలతో ఈ శిష్యుడు సానుభూతి పొందుతాడు. తాను ఆడేది వేరే ఆట, అందరూ ఆడే ఆట లాంటిది కాదు అని అనుకుంటాడు.

ఇంకొక రకం ఉన్నారు. నేను వీళ్ళ గురించి వ్యతిరేకతతో, లేదా, చిన్నచూపుతో, లేదా, కరకుగా మాట్లాడడం లేదు. వాళ్ళ పట్ల పూర్తి సానుభూతితోనే మాట్లాడుతున్నాను. ఈ ఆధునిక కాలపు ఆధ్యాత్మికగురువులకు వీరు అతిపెద్ద విశ్వాసనీయమైన శిష్య సమూహం. వాళ్ళే అసంతృప్త జీవులైన సంపన్నుల భార్యలు.

ఆమె ఒక సంపూర్ణ వ్యక్తి. ఆమె తన వ్యక్తిత్వాన్నీ, కలలనూ, కోరికలనూ, తన సమస్త జీవితాన్నీ వివాహం అనే వేదిక మీద బలిపెట్టింది. అందుకు ప్రతిఫలంగా అమెకు దక్కింది, ఏమాత్రం పట్టించుకోని భర్త. ఆ భర్త ఆమెకు ఎక్కువలో ఎక్కువ ఇద్దరు ముగ్గురు పిల్లలను ఇస్తాడు. అంతే.ఆయనకు ఆయన వ్యాపారాలలో, లేదా ఇతర స్త్రీలతో గడపడంలో క్షణం తీరిక ఉండదు. ఈ స్త్రీకి తలవాల్చి ఏడవడానికి ఒక భుజం కావాలి. తన మనుగడ నిరర్థకమని భావిస్తూ ఉంటుంది. ఆమెకు ఎటు చూసినా వెలుగు లేదు. ఆమె జీవితం ఒక శూన్యం. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ జీవితానికి అర్ధం లేదు. ఇదంతా ఓ విషాదం. కానీ, అక్షరాలా వాస్తవం.

మరొక రకం శిష్యులు ఉన్నారు. వాళ్ళకు హఠాత్తుగా ఏదో విపత్తు వస్తుంది. అనూహ్యంగా కన్నబిడ్డ చనిపోతాడు.భార్య మరణిస్తుంది. భర్త మరణిస్తాడు. లేదా వాళ్ళు ఆస్తి కోల్పోతారు. వ్యాపారంలో విపరీతంగా నష్టం వస్తుంది. ఏదో ఒకటి జరిగి వాళ్ళ జీవితాలు పెద్ద కుదుపుకు గురవుతాయి. వాళ్ళ ముందు ఒకే ఒక ప్రశ్న. ఇది మాకే ఎందుకు జరగాలి? ఈ ప్రశ్నను వారు ఎవరికి వేయాలి? వారు వెంటనే గురువు దగ్గరకు వెళతారు. ఇదంతా కర్మ ఫలితం నాయనా అని చెపుతారు గురువుగారు. నా వెంట నడువు. నీకు మరో లోకం ఉంది అని విశ్వాసం ఇస్తారు. ‘ఆ లోకంలో బాధ లేదు,వేదన లేదు, మరణం లేదు. అది అమరలోకం.

అక్కడ ఆనందం మాత్రమే ఉంది’. దుఃఖం నిండిన ఈ మనుషులకు గురువు గారు ఈ మాటలు చెప్పి ఓదారుస్తారు. నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని స్వర్గానికి, కైవల్యానికి, బాధ లేని చోటికి తీసుకుపోతాను అని చెపుతారు. అయ్యా, నన్ను క్షమించండి. ఇది విచారకరమే.కానీ వాస్తవం ఏమంటే అటువంటి స్వర్గం ఎక్కడా లేదు. జీవితంలో తప్పనిసరిగా, ఎంతో కొంత నిష్పత్తితో దుఃఖం ఉంటుంది. వేదన ఉంటుంది. అపజయాలకు అవకాశం ఉంటుంది. కానీ గురువు గారి మాటలతో వాళ్ళకు ఎంతో కొంత సంతృప్తి దొరుకుతుంది.

మరి, వాళ్ళకు అలా మెరుగైన మనఃస్థితి కలిగినప్పుడు, శాంతి దొరుకుతున్నప్పడు నీ అభ్యంతరం ఏమిటి అని ఎవరైనా నన్ను అడగొచ్చు. నేనెప్పుడో చదివిన ఒక కథ నాకిక్కడ గుర్తొస్తుంది. అది చాలా పాత భారత కథ. ఒక ముని ఆ కథ చెప్పాడు. ఆకలిగొన్న ఒక కుక్కకు ఒక ఎండిపోయిన ఎముక దొరికిందట. అది దాన్ని కొరకడానికి ప్రయత్నిస్తే, ఆ ఎముక నుంచి ఏమీ రాలేదు. కానీ దాని నాలుకనే అది కొరుక్కుందట. ఆ నాలిక నుంచి నెత్తురు బయటికి ప్రవహిస్తుంటే ఆ కుక్క మాత్రం అబ్బా, ఎముకలోకి సరిపోయే తిండి దొరికింది కదా అనుకుందట.

నాకు విచారం కలుగుతుంది. వేదనలో ఉన్న ఈ పెద్దలు ఇలా ప్రవర్తించకపోతే బాగుండునని అనిపిస్తుంది. వారి పట్ల గౌరవం ఉంది. మాదకద్రవ్యాలు, మద్యం కూడా మానసిక శాంతినీ, ఉపశమనాన్ని ఇస్తాయని చెపుతారు. కానీ అటువంటి శాంతిని, అటువంటి ఉపశమనాన్ని కోరడం మంచిదేనా? ఎవరికైనా అది మనం సిఫారసు చేస్తామా? కచ్చితంగా చేయం. హేతుబద్ధమైన ఆలోచనలలో నుంచి రాలేని మానసిక శాంతి ఏదైనా ఆత్మవంచనే తప్ప మరొకటి కాదు. సత్యం నుంచి దూరం తీసుకుపోయే ఉపశమనం ఏదైనా ఒక భ్రమ మాత్రమే. ఎండమావి మాత్రమే. ఇటువంటి ఉపశమనంలో ఒక భద్రత ఉందని నాకు తెలుసు. కానీ ఈ భద్రత ఒక మూడు చక్రాల సైకిల్ ను నడిపితే మీరు సురక్షితంగా ఉంటారు. పడిపోరు. కానీ, కాళ్ళూ, చేతులూ సక్రమంగా ఉన్న పెద్దలు మూడు చక్రాల సైకిల్ నడపరు. వాళ్ళు రెండు చక్రాల సైకిల్ నడుపుతారు. అలా నడపడంలో పడిపోవచ్చు. కానీ, అది జీవితంలో భాగం.

ఇంకొక రకం కూడా ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, గోల్ఫ్ క్లబ్ సభ్యులైన వారందరికీ గోల్ఫ్ మీద పెద్ద ఆసక్తి లేనట్టుగానే ఆశ్రమంలో కనబడే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికవ్యక్తి కానక్కర్లేదు. నాకు తెలిసిన ఒక సినిమా నిర్మాత ఉన్నారు. ఒక గురువు గారికి కరుడుగట్టిన అనుయాయి. ఆ గురువు గారి ఆశ్రమం ఢిల్లీకి రెండు గంటల దూరంలో ఉంది. ఆ నిర్మాత నన్ను ఒకసారి వాళ్ళ గురువు దగ్గరకు వెళ్ళమని అడిగారు. ఆశ్రమానికి వెళ్ళావంటే ఢిల్లీలోని ప్రముఖులందరూ నీకక్కడే కనబడతారు. నీకు తెలుసా? మా గురూజీ కాబోయే చంద్రస్వామి. చూస్తూండు. అన్నాడాయన. అంటే, ఇవాళ ఆధునిక గురువుల ఆశ్రమాలు పైరవీలకూ, పనులకు పరిచయ స్థానాలు అయ్యాయి.

నిజం చెప్పాలంటే ఆ దృష్టి ఉన్న , మత దృష్టి ఉన్న ప్రజల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నేనిప్పుడు చెప్పి న కారణాలన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు మంచి వాళ్ళు. ఒక కారణం కూడా చెప్పాలి. ప్రతి ఉద్వేగానికీ, ప్రతి అనుభూతికీ ఉన్నట్టుగానే దీనికి కూడా ఒక పరిమితి ఉంది.

ఎవరైనా ఒక అంశం చూడగలరు. ఆ తర్వాత చూడలేరు. ఒక అంశం వరకు వినగలరు. ఆ తర్వాత ఏ శబ్దాన్నీ గ్రహించలేరు. ఒకానొక సమయం వరకు దుఃఖించగలరు. క్రమంగా ఆ దుఃఖాన్ని అధిగమిస్తారు. ఒకానొక స్థితి వరకే సంతోషాన్ని అనుభవించగలరు. ఆ తర్వాత సంతోషం కూడా అయిపోతుంది. అలాగే మంచితనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు ఒక స్థాయి వరకే మంచివాళ్ళుగా ఉండగలరు.మనిషిలో ఈ మంచితనపు సామర్థ్యం సగటున పది యూనిట్లు ఉంటుందనుకుంటే ఆ మంచితనపు సామర్థ్యం మొత్తాన్ని అటు మసీదుకు వెళ్ళి రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసే వారైనా, ఇటు గుడికి వెళ్ళో, లేదా గురువు పాదాల దగ్గరో కూచునే వాళ్లయినా పూర్తిగా ఖర్చు పెట్టేస్తున్నారని నాకనిపిస్తుంది. అదంతా కూడా అనుత్పాదకమైన పద్ధతిలో ఖర్చు పెడుతున్నారనిపిస్తుంది. నేనెక్కడా ప్రార్థనలు చేయను. నేను ఏ గురువు దగ్గరకీ వెళ్లను. మసీదుకో, గుడికో, చర్చికో వెళ్లను. అప్పుడు నా మంచితనపు సామర్థ్యాన్ని నేను ఏం చేస్తాను? బహుశా ఆ మంచితనపు సామర్థ్యంతో నేను మరొకరికి సాయపడతాను. మరొకరికి తిండి పెడతాను. మరొకరికి ఆశ్రయం ఇస్తాను.మనుషులు తమలో ఉన్న మంచితనపు సామర్థ్యాన్ని పూజలో, ప్రార్థనలో, మత విగ్రహాలను ఆరాధించడంలో ఆధ్యాత్మికగురువులను కొలవడంలో ఖర్చు పెట్టే బదులు, ఆ మంచితనాన్ని మిగుల్చుకుని దాన్ని మరొకందుకు వాడితే వాళ్ళకు నా అభినందనలు.

మతానికి చెందిన మనుషులు పట్ల ఇటువంటి భావాలు ఉన్నప్పుడు నాకు కబీర్ మీదనో, గౌతముడి మీదనో అంత గౌరవం ఎలా ఉందని మీరు అడగవచ్చు. వాళ్ళను నేనెందుకు గౌరవిస్తానో చెపుతాను. వాళ్ళందరూ మానవ నాగరికచరిత్రకు గొప్ప దోహదం చేసినవాళ్ళు. చరిత్రలో వేరు వేరు కాలాల్లో, వేరు వేరు పరిస్థితులలో వాళ్ళు జీవించారు. వాళ్ళందరి మధ్య ఒకే ఉమ్మడి సూత్రం ఉంది. వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.వాళ్ళు అట్టడుగు ప్రజల కోసం పోరాడారు. పాలకులు చక్రవర్తులైనా, సామ్రాజ్యవాదులైనా, వ్యతిరేకంగా పోరాడారు.కబీర్, ఫిరోజ్ తుగ్లక్ మతోన్మాద ఆధిపత్యాన్ని ఎదుర్కొని పోరాడాడు. నాకు ఆశ్చర్యం కలిగించేదీ, నా అనుమానాలను నిజం చేసేది ఏమంటే ఇవాళ మాత్రం తమను తాము మతాధిపతులమని చెప్పుకునే వాళ్ళు, విశ్వసత్యం తమకు మాత్రమే గ్రహింపుకు వచ్చిందని అనేవాళ్ళు ఒక్కరు కూడా అధికారానికి వ్యతిరేకంగా నిలబడడం లేదు. పాలకవర్గాలకూ, సంపన్న వర్గాలకూ వ్యతిరేకంగా వీళ్లలో ఒక్కరు కూడా గొంతెత్తడం లేదు. వీళ్ళు ధర్మం చేస్తారు. నిజమే. కానీ,అధిపత్య వ్యవస్థ, అధికారంలో ఉన్నవారు అంగీకరించినంత వరకే ఆ ధర్మం సాగుతుంది. ఈరోజున దళితులకు ప్రవేశం లేని దేవాలయాలలోకి వారిని నడిపించుకు వెళ్ళగలిగిన ఆధ్యాత్మికగురువులు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న. దురాక్రమణదారులకూ,బడా కాంట్రాక్టర్లకూ వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసుల హక్కుల కొరకు నిలబడే ఆధ్యాత్మికగురువులు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న. గుజరాత్ మారణకాండకు బలి అయిన వారికోసం మాట్లాడిన, బాధితుల సహాయ శిబిరానికి వెళ్ళిన గురువు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న.

ధనికులకు ఉఛ్వాసనిశ్వాసలు బోధించినంత మాత్రాన సరిపోదు. ఇది కేవలం సంపన్నుల వినోద క్రీడ. ఇది కుటిలవాదుల మేలి ముసుగు. ఇది దుర్మార్గమైన వంచన. ఈ దుర్మార్గమైన వంచనను మీరు ఏ నిఘంటువులో చూసినా ఆధ్యాత్మికత అని పిలవలేరు. దానికి ఉన్నది ఒకే ఒక్క మాట బూటకం.

Read more RELATED
Recommended to you

Latest news