మహాభారతంలో అత్యంత ఆసక్తిగొలుపే భాగం యుద్ధం. ఈ యుద్ధంలో అనేక వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో భీష్మ, ద్రోణులు చనిపోయిన తర్వాత కర్ణుడిని సైన్యాధ్యక్షుడిగా ధుర్యోధనుడు ప్రకటిస్తాడు.
కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మొదటిరోజు మకరవ్యూహం అంటే మొసలి ఆకారంలో సైన్యాన్ని నిలపడం. మొసలి ఎలా నీటిలో చొచ్చుకుని పోతుందో అలా శత్రు సైన్యంలోకి చొచ్చుకపోవడం. మొసలి వ్యూహంలో- నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు, కన్నుల వద్ద శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు నిల్చున్నారు. తలభాగంలో అశ్వత్థామడు, మెడప్రాంతంలో తన తమ్ములను నిలిపాడు ధుర్యోధననుడు. మొసలి ఆకారంలో ఉన్న వ్యూహంలో పాదాల ప్రాంతంలో కృతవర్మ, కృపాచార్యుని నియమించాడు. కడుపు వద్ద సుయోధనుడు అంటే ధుర్యోధనుడు తానే స్వయంగా నిల్చున్నాడు. వెనక కాళ్ల వద్ద శల్యుడు,సుషేణుడు తమ తమ సైన్యాలతో నిలబడ్డారు. మిగిలిన సేనలను వ్యూహం చుట్టూ నిలిపాడు కర్ణుడు. ఇలా మకర వ్యూహాన్ని తీర్చిదిద్దాడు కర్ణుడు.
దీనికి ప్రతివ్యూహంగా పాండవుల్లో అర్జునుడు అర్ధ చంద్ర వ్యూహాన్ని రూపొందించాడు. వ్యూహం మధ్యలో తాను అంటే అర్జునుడు నిలబడ్డాడు. ఎడమ కొమ్మున భీమసేనుడిని, కుడి కొమ్మున ధృష్టద్యుమ్నుడిని, ధర్మరాజును, నకుల సహదేవులను వ్యూహం వెనక భాగాన నిలబెట్టాడు. అర్జునుడికి చక్రరక్షకులుగా యుధామన్యుడు, ఉత్తమౌజుడు నిల్చున్నారు. అర్ధ చంద్రవ్యూహం, మకర వ్యూహంతో మహా భీకర యుద్ధం పాండవులు, కౌరవుల మధ్య జరిగింది. కర్ణుడి సైనాధ్యక్షుడిగా వ్యవహరించిన మొదటి రోజు పాండవులే పైచేయి కావడం విశేషం.
– కేశవ