మహర్షి సినిమా కథను గత కొంత కాలం కిందట దిల్ రాజుకు తాను చెప్పానని, కానీ ఆయన తన కథను వాడుకుని మహర్షి సినిమా తీశాడని, ఆ సినిమా కథ నిజానికి తనదేనని దర్శకుడు శ్రీవాస్ ఆరోపించారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయినప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇక చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు గాను సక్సెస్ మీట్ పెట్టారు కూడా. అయితే మహర్షి మూవీ సినిమా కథ తనదేనంటూ.. ఓ డైరెక్టర్ ఇప్పుడు తెరపైకి వచ్చారు. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
గతంలో రామ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాను శ్రీవాస్ తెరకెక్కించిన విషయం విదితమే. అయితే మహర్షి సినిమా కథను గత కొంత కాలం కిందట దిల్ రాజుకు తాను చెప్పానని, కానీ ఆయన తన కథను వాడుకుని మహర్షి సినిమా తీశాడని, ఆ సినిమా కథ నిజానికి తనదేనని దర్శకుడు శ్రీవాస్ ఆరోపించారు. దీంతో స్పందించిన దిల్ రాజు శ్రీవాస్‌కు సర్ది చెప్పాడట.
మహర్షి మూవీ కథ తనదేనని చెబుతున్న శ్రీవాస్‌తో నిర్మాత దిల్ రాజు మాట్లాడాడట. గతంలో శ్రీవాస్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా దిల్ రాజు ఆయనతో ఓ సినిమా చేస్తానని చెప్పాడట. దీంతో శ్రీవాస్ మెత్త బడినట్లు సమాచారం. కాగా గతంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కథపై కూడా వివాదం కొనసాగింది. ఈ క్రమంలో కథ తనదేనంటూ కోర్టును ఆశ్రయించిన ఆ బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. చాలా కాలం పాటు మిస్టర్ పర్‌ఫెక్ట్ వివాదం కోర్టులో నడవగా, అందులో బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. మరి మహర్షి మూవీ కథ వివాదం సద్దు మణుగుతుందా లేదా మళ్లీ తెరపైకి వస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!