దేశం, రాష్ట్రం కాదు… ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు భక్తజనం ఇసుక వేస్తే రాలనంతగా వస్తున్నారు. తెలంగాణ కుంభమేళగా కీర్తిగాంచిన ఈ జాతరక చివరి అంకానికి చేరుకుంటుంది. ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందో తెలుసుకుందాం…
మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు ‘మండెమెలిగే’ పేరిట తొలిపూజలు నిర్వహించారు. రెండోరోజు మహాఘట్టంలో ‘మందిర సారె’ పేరుతో జంటశక్తి మాతలకు చీరసారెల్ని సమర్పించారు. రేపు అంటే ఫిబ్రవరి 8న మూడో రోజున ‘నిండు జాతర’ నాడు మేడారం లక్షలాది భక్తుల సందోహంతో వర్ధిల్లుతుంది. బెల్లపు దిమ్మెల్ని ‘బంగారం’గా వ్యవహరిస్తూ వాటిని అమ్మతల్లులకు భక్తులు చెల్లిస్తారు. నాలుగోరోజు శక్తిమాతల ‘వనప్రవేశం’తో ఈ జాతర ముగుస్తుంది. పూర్వం దట్టమైన అటవీ ప్రాంతంలోని తాడ్వాయి మండలం ఈ గ్రామంలో మారేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం కూడా ఉన్నాయి అందుకే ఈ ఊరికి మేడారం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణ. లక్షలాది మంది భక్తుల అపూర్వ సంగం. వనదేవతల జాతర మహాద్భుత ఘట్టం.
– కేశవ