(జూలై 16 -దక్షిణాయనం సందర్భంగా)
ఆడిమాసం అంటే కర్కాటకమాసం. కర్కాటకం నుంచి దనస్సు అంతం వరకు గల ఆరుమాసాలపాటు సూర్యుడు సంచరించేకాలం దక్షిణాయనం. అంటే సూర్యభగవానుడు ప్రవేశించే కర్కాటకసంక్రమణ సమయం దక్షిణాయన పుణ్యకాలం. ఈరోజు తిరుమల శ్రీవారికి విశేష పూజలు చేసే సంకల్పంతో ఏర్పడిందే అణివర ఆస్థానం. దీని ఆణివరఆస్థానం.. .అసలు పేరు ఆడిపూజ., అదే ఆణివల్ అయింది. తమిళసంస్కృతి ప్రభావంతో ‘“డ” ‘ణ గా మారి ఆణివార్ అయి ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. ఈ విశేషపూజలో స్వామివారికి వచ్చే సంవత్సరఆదాయం- అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంగా ఏర్పడి ఈరోజు నుండి అధికారులు మార్చుచెంది, పరిపాలన సక్రమంగా జరపడానికిగాను స్వామివారివద్ద వినతులు సమర్పించి, అధికారాన్ని పూర్వం పొందినట్లుగా చెప్పుకోవచ్చు.
పుణ్యకాలంలో పుణ్యకార్యాలు చేయటం విశేషసంస్కృతి. ఆణివర ఆస్థానసమయంలో స్వామిని కొలవటం, సేవించటం,
కీర్తించటం, ధ్యానించటం స్వామిసాక్షిగా పుణ్యకార్యాలు ఆరాధించటం జన్మసాఫల్యతకు, భగవదనుగ్రహప్రాప్తికి సోపానంగా పెద్దలు చెప్తారు. సర్వజగత్ర్రభువైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి జరుగుతున్నవార్చికఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నది ఆణివరోత్సవం. కానీ రోజులాగే ఆస్థానంకంటే కూడ దక్షిణాయన పుణ్యకాలమైన జూలై 16న జరిగే ఆణివర ఆస్థానం చాల విశిష్టమైంది. తిరుమల ఆలయ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొంది.
ప్రతిరోజూ మాదిరే దక్షిణాయన సంక్రమణం రోజున ఉదయం శ్రీస్వామివారికి సుప్రభాతం, విశ్వరూపదర్శనం, తోమాలసేవ యథాప్రకారం జరుగుతాయి. అయితే రోజూ జరిగే కొలువు శ్రీనివాసమూర్తికి బంగారు సింహాసనంపై కొలువు జరగదు. తోమాలసేవ అయిన వెంటనే శ్రీదేవిభూదేవేరులతో కూడి ఉన్న శ్రీమలయప్పకు (ఉత్సవమూర్తులు) శ్రీవిష్వక్సేనుల (శ్రీస్వామివారి సేనాధిపతి) వారికే ఆలయంలోనే ఏకాంతంగా తిరుమంజనం (అభిషేకం) జరుప బడుతుంది. పిదప మొదటి సహస్రనామార్చన, నైవేద్యం (మొదటిగంట) నిర్వహిస్తారు. పిదప బంగారువాకిలి ముందున్న తిరుమహామణి (ఘంటామండపం) మండపంలో సర్వభూపాలవాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీస్వామివారిని బంగారువాకిలి ముందుగా గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు.
సర్వాభరణాదులతోను, సుగంధపరిమళభరితమైన పుష్పమాలికలతోను ఉత్సవమూర్తులను విశేషంగా అలం కరిస్తారు. శ్రీస్వామివారికి ప్రక్కగా చెరొకపీఠంపై దక్షిణాభిముఖంగా శ్రీవిష్వక్సేనుల వారిని కూడ వేంచేపు చేసి ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకరిస్తారు. శిరస్త్రాణాన్ని, ఖడ్దాన్ని ధరించి అత్యంత భయభక్తులతో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆజ్ఞలను అమలుపరచదానికి సిద్ధమై, సర్వసన్నద్ధమై ఉంటాడు సేనాధిపతి. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసి ఉన్న శ్రీవారి
ఉత్సవమూర్తులకు, సేనాధిపతికి విశేషమైనప్రసాదాలు నివేదింపబడతాయి.
– శ్రీ