తొమ్మిదవ రోజు ధూమ్రవర్ణ వినాయకుడు నైవేద్యం – నేతి అప్పాలు

సూర్య భగవానుడు కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం, జగత్ చక్షువు అంటే ఈ ప్రపంచానికి కన్నులాంటి వాడు. ఆయన రాకపోకలే  జనజీవనానికి మార్గదర్శకాలు. ఈ జగత్తుకు కర్తను తానే అన్న భావన సూర్యునిలో ప్రవేశించింది. ఎంత గొప్పవాడికైనా అహంకారం అనర్థదాయకమే కదా! ఆ క్షణంలోనే సూర్యునకు తుమ్ము వచ్చింది. దాని నుంచి అహంకార రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఆ అహంకారాసురుడు కు క్రాచార్యుడికి శిష్యుడై గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. అరణ్యాలకు వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు. వినాయకుడి సాక్షాత్కారం పొంది ఆరోగ్యాన్ని, అమరత్వాన్ని, జయశీలతను వరాలుగా పొందాడు. సుఖప్రియ నగారానికి రాజై ప్రమదానురుని పుత్రిక అభిలాషను పెళ్లి చేసుకుని గర్వుడు అనేవాడితో పాటు మరికొందరిని పుత్రులుగా పొందాడు.

లోకాలను జయించి తన రాక్షస ప్రవృత్తితో అందరినీ హింసించసాగాడు. దాంతో ధర్మకర్మలు నశించి అధర్మకార్యాలు వ్యాపించాయి. ఆ బాధలను భరించలేక దేవతలు, మునులు ధూమ్రవర్ణ వినాయకుని ప్రార్థించారు. వారి మొరవిన్న గణనాథుడు అహంకారాసురుడికి బుద్ధి చెప్పమని నారదుడిని తన తరఫున వంపించాడు. కానీ అహంతాసురుడు నారదుని మాటను లెక్కచేయలేదు.

మూషికాసురుడు వినాయకుడితో పోరుకు దిగి తన తరఫున యుద్ధము చేయుటకు మిత్రుడైన అహంకారాసురుని ఆహ్వానించాడు. వాడు ముల్లోకాలు దద్దరిల్లేలా పగలబడి నవ్వుతూ గణేశుని లెక్కచేయ కుండా, భయంకరమైన పొగను తన ముక్కు రంధ్రముల నుంచి వెదజల్లటం మొదలు పెట్టాడు. ఆ పొగ ప్రళయ వాయువులా ముల్లోకాలను చుట్టుముట్టింది. విషపూరితమైన ఆ ధూమంతో అంతా ఉక్కిరిబిక్కిర య్యారు. నీవే దిక్కంటూ అందరూ పార్వతీపుత్రుడి శరణు వేడుకున్నారు. వారికి అభయమిచ్చిన వినాయకుడు గట్టిగా శ్వాస పీల్చాడు. ఆ ఉచ్ఛ్వాన శక్తికి ముల్లోకాల్లో వ్యాపించిన పొగ తగ్గుముఖం పట్టింది. గణేశుడి ముక్కు రంధ్రాల ద్వారా అతనిలో కలిసిపోయింది.

ఆ సమయంలోనే కొంత ధూళి శరీరం మీద పడి గణ నాయకుడు ధూమ్రవర్ణంతో విరాజిల్లాడు. ఆ అద్భుత రూపాన్ని చూసిన దేవతలు, మునులు జయ హె ధూమ్ర వర్ణ వినాయకా అంటూ జయజయ ధ్వానాలు చేశారు. ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశంతో అహంకారాసురుని పీచమణచాడు. దాంతో శరణాగతుడై గణేశుడి ఆదేశం మేరకు పాతాళానికి వెళ్లిపోయాడు. గణేశుడి అర్చన జరుగుచోటికి రానుగాక రానంటూ చెప్పి మరీ వెళ్లాడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో గణ నాయ కుడిని పూజించు వారిలో అహంకారము ప్రవేశించలేదు. అహంకారమునకు దూరముగా ఉండి చేయునదే నిజమైన గణేశారాధన.

తొమ్మిదవనాటి పూజతో విజయ గణపతి అనుగ్రహంతో చేపట్టిన ప్రతికార్యము విజయవంతం అవుతుంది.