Ganesh Chaturthi : గణేశ్ నవరాత్రుల్లో ఈ వినాయకుడి ఆలయాలు సందర్శిస్తే ఎంతో పుణ్యం..!

-

మరో నాలుగు రోజుల్లో గణేశ్ నవరాత్రులు మొదలుకాబోతున్నాయి. చిన్నాపెద్దా అంతా కలిసి పెద్ద సంబురంగా జరుపుకునే ఈ పండుగ కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నవరాత్రుల్లో ఏం చేయాలని పెద్దలు.. ఎలాంటి ఆటలు ఆడుకోవాలని పిల్లలు ఓ ప్లాన్ వేసుకుంటున్నారు. కొంతమంది నవరాత్రుల్లో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన వినాయకులను, గణేశ్ మండపాలను చూడటానికి వెళ్తుంటారు. మరికొంత మంది వివిధ ప్రాంతాల్లో ఉన్న గణపతి దేవాలయాలకు వెళ్తారు. అయితే వినాయక నవరాత్రుల్లో దేశంలోని ఐదు ప్రసిద్ధ గణపతి ఆలయాలను సందర్శిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మరి ఆలయాలేంటి.. ఎక్కడున్నాయో తెలుసుకోండి. ఈ గణేశ్ నవరాత్రుల్లో వాటి సందర్శనకు వెళ్లిరండి..

మన దేశంలో అన్నిటి కంటే ఫేమస్ ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్. ఈ ఆలయానికి ఇతర దేశాల ప్రముఖులు కూడా వస్తుంటారు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటే ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు రావని భక్తుల నమ్మకం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందికి ఈ టెంపుల్ ఫేవరెట్. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సిద్ధివినాయక ఆలయ సందర్శనతో తన భారతదేశ పర్యటనను ప్రారంభించారు. ఇక్కడి దేవుడిని నవాసాచ గణపతి అని కూడా పిలుస్తారు.

దేశంలోని ప్రసిద్ధ వినాయక ఆలయాల్లో రెండు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఒకటి ముంబయిలో ఉన్న సిద్ధి వినాయకుడి గుడి అని చెప్పుకున్నాం. మరొకటి ఏంటంటే.. పుణెలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయం. ఈ గుడి 130 ఏళ్ల నాటిదట. నంద్‌గావ్‌కు చెందిన వ్యాపారి స్వీట్ మేకర్ శ్రీమంత్ దగదుషేత్ హల్వాయి తన భార్య లక్ష్మీబాయి పుణేలో స్థిరపడ్డారు. స్వీట్ షాప్ యజమాని దగ్దుసేత్, ప్లేగు వ్యాధితో కోల్పోయిన తన కొడుకు జ్ఞాపకార్థం నిర్మించిన ఆలయం దగదుషేత్ హల్వాయి గణపతి దేవాలయం. ప్రతి సంవత్సరం, గణపతి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. బాలగంగాధర తిలక్ ఈ గణపతి మందిరం ఆవరణలో గణేష్ చతుర్థిని ప్రజా పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సామూహిక గణేష్ చతుర్థి వేడుకలు ఇక్కడే మొదలయ్యాయి.

 

మరో ఫేమస్ గణేశ్ టెంపుల్ జయపురలోని మోతీ దుంగ్రి గణేశ్ ఆలయం. 1761లో నిర్మించిన ఈ ఆలయానికి 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోటలు, కొండలతో చుట్టుముట్టబడి జయపుర పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడి గణపతి విగ్రహం 500 ఏళ్ల కాలం నాటిదని చరిత్ర చెబుతోంది. సింధూర రంగులో ఉండే ఇక్కడి వినాయకుడికి తొండం కుడివైపు ఉంటుంది.

చెన్నై బీసెంట్ నగరంలో ఉన్న ఐకానిక్ టెంపుల్ వరసిద్ధి వినాయగర్ ఆలయం. ప్రతి ఏటా ఈ ఆలయంలో గణేష్ చతుర్థి వేడుకలు గొప్పగా జరుపుకుంటారు. ఈ ఆలయం సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. పేదలకు ఆహారం ఇవ్వడం వంటి సామాజిక కార్యక్రమాలను కూడా చేపడతారు.

మరో ప్రసిద్ధ గణపతి దేవాలయం కేరళలోని కలమస్సేరి మహాగణపతి ఆలయం. ఈ ఆలయంలో గణేశుడు, సుబ్రమణ్యుడు, నవగ్రహాలు, శివుడు, పార్వతి, రాముడు వంటి ఇతర హిందూ దేవతలున్నాయి. ఈ ఆలయాన్ని 1980లలో కలమస్సేరి ఎన్ రఘునాథ మీనన్ నిర్మించారు. ఇక్కడ గజపూజ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భక్తులు ఏనుగులను గణేశుడి అవతారంగా పేర్కొంటారు.

ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్​లోని కాణిపాకం కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో కొలువై ఉంటాడు. ఆ బావిలో మనకు నచ్చిన వస్తువేదైనా వేస్తే.. మన కోరికలు తప్పకుండా నెరవేరతాయనేది భక్తుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news