గణపయ్యలోని ప్రత్యేక గుణాల గురించి మీ పిల్లలకు చెప్పారా..?

-

వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. గణేశ్ మండపాల్లో పిల్లల కోలాహలం అంతా ఇంతా కాదు. ఈ నవరాత్రులు పిల్లలంతా స్కూల్ నుంచి డైరెక్ట్​గా గణేశ్ మండపాల వద్దకే చేరుకుంటారు. అందరూ కలిసి ఆడుతు పాడుతూ గణపయ్యకు పూజలు చేసి భజన చేస్తూ నవరాత్రులను ఎంజాయ్ చేస్తారు. ఇదంతా ఓకే కానీ మీ పిల్లలకు మహాగణపతి గురించి చెప్పారా..? ఆ లంబోదరుడిలో ఉండే లక్షణాలు, ఆ విఘ్నేశ్వరుని గుణగణాల గురించి పిల్లలకు తెలుసా..? లేదంటే చెప్పాల్సిందే..? ఆటపాటలతోనే మీ పిల్లలకు ఆ గణనాథుడి గుణగణాల గురించి వివరించండి..? వాటిని అలవర్చుకునేలా తీర్చిదిద్దండి. ఇంతకీ ఆ ఆదిదేవుడి గుణగణాలు ఏంటంటే..?

మన గణేశుడు భలే స్మార్ట్ .. ఈ రోజుల్లో హార్డ్​వర్క్ కంటే స్మార్ట్​వర్క్​కే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే మీ పిల్లలకు కూడా ఏదైనా చేయాలనుకుంటే దానికోసం కష్టపడాలని చెబుతూనే మరీ స్మార్ట్​ వేలో దాన్ని సాధించాలనే విషయం నేర్పించండి. దీనికి మన బొజ్జగణపయ్యనే ఉదాహరణగా తీసుకోండి. గణేశునికీ, సోదరుడు కుమారస్వామికీ ఒక పోటీ పెట్టారు తల్లిదండ్రులు. భూమండలాన్ని మూడుసార్లు వేగంగా చుట్టి వచ్చిన వారికి మహిమాన్విత ఫలం బహుమతి. కార్తికేయునితో పోలిస్తే గణేశుడి వనరులు అంతంత మాత్రమే. పైగా భారీకాయం. అప్పుడు నిరాశపడకుండా తెలివిగా ఆలోచించాడు. అమ్మానాన్నల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి, ‘మీరే నా ప్రపంచం.. ఇక నా ప్రపంచ ప్రదక్షిణ పూర్తయినట్టేగా’ అన్నాడు తెలివిగా. ప్రతికూల పరిస్థితుల్లో కంగారు పడిపోకుండా…వాటిని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చెప్పే కథ ఇది.

అనుకున్నది అయ్యే వరకు పట్టువదలొద్దు.. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఆ పని అయ్యే వరకు పట్టువదలొద్దు. మీ పిల్లలకు ఈ విషయం నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. చాలా మంది ఏదైనా పని మొదలుపెట్టి కాస్త కష్టంగా అనిపించగానే మధ్యలోనే వదిలేస్తుంటారు. అలా చేయకుండా మొదలుపెట్టిన పనని పూర్తి చేయడమెలాగో వినాయకుడిని చూసి నేర్చుకోమని చెప్పండి.

వేగంగా రాయడం వినాయకుని ప్రత్యేకత. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే… ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసునికి మాటిచ్చాడు లంబోదరుడు. కానీ మధ్యలో అతని కలం మొరాయించింది. ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తిచేశాడు. చేపట్టిన పనిని పూర్తిచేయడానికి త్యాగం, సాహసం అవసరమని ఈ కథ చెబుతోంది.
కుతూహలం ఇంపార్టెంట్ గురూ.. ఏ విద్యార్థి అయినా కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. కుతూహలాన్ని ప్రదర్శించాలి. వర్షాల్లేక విపరీతమైన కరవుకాటకాలతో తల్లడిల్లుతున్న నేలని తడపడానికని అగస్త్య మహాముని శివుని దగ్గరున్న గంగాజలాన్ని తీసుకుని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడు. విశ్రాంతి తీసుకుందామని ఓ చోట నడుంవాల్చాడు. ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామనుకున్న గణేశుడు కుతూహలం కొద్దీ కాకి రూపంలోకి మారి దానిపై వాలాడు. ఆ బరువుకి కమండలంలోని నీళ్లు ఒలికి… కావేరీ నదిగా మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. గణేశునిలోని ఆసక్తీ, కుతూహలమే కదా ఇందుకు కారణం.

సంయమనం కోల్పోకుండా.. మహా ధనవంతుడైన కుబేరుడు శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని, సంపదలని చూపించి మురిసిపోవాలని అనుకున్నాడు. అందుకు తన ఇంటికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలుపడదని, కొడుకు గణేశుణ్ని పంపాడు. గణేశుడికి కుబేరుడి అంతరంగం అర్థమైంది. అయినా వినయంగానే ఉన్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే… పెట్టినవి పెట్టినట్టు తినేశాడు లంబోదరుడు. కుబేరుని దగ్గర ఇక ఏమీ మిగల్లేదట. అప్పుడతనికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకూడనేది ఇక్కడ గణపయ్య నేర్పే పాఠం.

Read more RELATED
Recommended to you

Latest news