దేవాలయానికి కొంత దూరం నుంచే కన్పించేది ధ్వజస్తంభం. ఇక ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొంటారు..
ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల (ఆత్మ, విద్యా, శివ తత్త్వాల)సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పై భాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. మూడు పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు మూడు ఉంటాయి. ఇలా ఈ స్తంభ నిర్మాణమంతా మూడుతో ముడిపడి ఉంది. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది. ధ్వజస్తంభంపై అడుగడుగునా పట్టికలు కన్పిస్తాయి. అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణ చేసేవారు. రానురానూ స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో వెదురు కొయ్యకు గణుపులున్నట్లు పట్టీలను పెడుతున్నారు. ఈ గణుపులు బేసిసంఖ్యలో ఉంటాయి.
ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు. ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. శివాలయాలలో బలిపీఠం తర్వాత, విష్ణ్వాలయాలలో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో, వెనుకవైపు రెండు ధ్వజస్తంభాలున్నాయి. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. శ్రీరంగానికి దగ్గరలోని జంబుకేశ్వరంలో ఎనిమిది ధ్వజస్తంభాలు ఉన్నాయి. వీటిని దిక్ ధ్వజస్తంభాలంటారు. దేవాలయ ఆగమం ప్రకారం దేవాలయానికి వెళ్లలేనివారు ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన దేవాలయంలోకి వెళ్లిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు నిలబడి అత్యంత శ్రద్ధతో మనస్సును భగవంతునితో లగ్నం చేసి కోరిన కోర్కిలు తప్పక ఫలిస్తాయని పండితుల ఉవాచ.