హ‌త‌విధీ.. క‌రోనా ఎంత కష్టం తెచ్చింది.. ప్రైవేటు ఉద్యోగుల వ్య‌థ‌..!

-

”ప్ర‌శాంత్‌.. బెంగ‌ళూరులోని అమెరికాకు చెందిన ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. క‌రోనా వ‌ల్ల ప్రాజెక్టులు ఏవీ రావ‌డం లేదు. దీంతో అత‌న్ని స‌డెన్‌గా పిలిచి ఉద్యోగం నుంచి తొల‌గిస్తున్న‌ట్లు కంపెనీ చెప్పింది. అత‌ను, అత‌ని భార్య ఇద్ద‌రూ ఉద్యోగ‌స్తులే. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ ప‌నిచేస్తేనే గానీ ఇల్లు నెట్టుకురాలేరు. ఈఎంఐలు, ఇంటి రెంటు, పెద్ద‌ల‌కు మెడిసిన్ ఖ‌ర్చులు.. ఇలా నెల వ‌చ్చే సరికి తమ జీతం కూడా ఒక్కోసారి త‌మ‌కు స‌రిపోదు. ఇలాంటి స్థితిలో ప్ర‌శాంత్ ఉద్యోగం కోల్పోయే స‌రికి అత‌నికి ఏం చేయాలో తెలియ‌డం లేదు. మ‌రోవైపు సొంత ఊరికి వెళ్దామంటే.. లాక్‌డౌన్ ఉంది. మ‌రో నెల గ‌డిస్తే.. ఇంటి రెంట్ కూడా చెల్లించ‌లేడు. దీంతో అత‌నికి తీవ్ర‌మైన ఆందోళ‌న క‌లుగుతోంది.”

”ప్రియ‌.. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ప‌నిచేస్తోంది. నెల‌నెలా ఆమె కొత్త క్ల‌యింట్ల‌ను తీసుకురావాలి. క‌రోనా వ‌ల్ల గ‌త నెల ఆమె ఆ ప‌నిచేయ‌లేక‌పోయింది. దీంతో ఆమెకు ఈ నెల రావ‌ల్సిన జీతంలో 40 శాతం కోత విధించారు. ఇక ఈ నెల కూడా క్ల‌యింట్లు వ‌చ్చే అవ‌కాశం దాదాపుగా లేక‌పోవ‌డంతో.. ఆమె వ‌చ్చే నెల త‌న ఉద్యోగం పోతుందేమోన‌ని తీవ్రంగా భ‌య‌ప‌డుతోంది. మ‌రోవైపు నెల తిరిగే స‌రికి బోలెడన్ని ఖ‌ర్చులు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో ఆమెకు పాలుపోవ‌డం లేదు..”

corona crisis brought tears to private employees in india

పైన చెప్పిన రెండు ఉదాహ‌ర‌ణ‌లు క‌థ‌లు కాదు.. నిజాలే.. దేశంలోని అనేక న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులే కాదు, దాదాపుగా ఇత‌ర ప్రైవేటు ఉద్యోగుల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. వ‌ర్క్ లేద‌ని చెప్పి కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌ను తీసేస్తుంటే.. కొన్ని కంపెనీలు జీతాల్లో కోత విధిస్తున్నాయి. ఇక కొన్ని కంపెనీలు ఉద్యోగులను బ‌ల‌వంతంగా రాజీనామా చేయిస్తున్నాయి. వారు సొంతంగా రాజీనామా చేస్తే రెండు నెల‌ల జీతం ముందుగా ఇస్తామ‌ని, లేదంటే తాము ఒక నెల జీతం ఇచ్చి ఉద్యోగం నుంచి తీసేస్తామ‌ని చెబుతున్నాయి. దీంతో ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రై రాజీనామా చేయాల్సి వ‌స్తోంది. ఇక చాలా మంది జూనియ‌ర్ ఉద్యోగులు, మెట‌ర్నిటీ లీవ్ మీద ఉన్న మ‌హిళ‌లు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు.

సాధార‌ణంగా ఐటీ కంపెనీల్లో 2 వారాల పాటు ఒక ఐటీ ఉద్యోగి ఏ ప్రాజెక్టు చేయ‌క‌పోతే.. ఆ ఉద్యోగిని కంపెనీలు తీసేస్తాయి. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఇదే జ‌రుగుతోంది. గ‌త వారం రోజులుగా బెంగ‌ళూరులోని ప‌లు కంపెనీల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు దాదాపుగా 500 మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌రిస్థితి ఇప్పుడెలా ఉంది, ముందు ముందు ఎలా ఉండ‌బోతుంది..? అన్న విష‌యాన్ని మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఉద్యోగులు త‌మ జాబ్‌ల‌ను కోల్పోతుండ‌డంతోపాటు.. పొంచి ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

నెల తిరిగే స‌రికి స‌గ‌టు ఉద్యోగికి ఇంటి రెంటు, ఈఎంఐలు, క‌రెంటు బిల్లులు, ఇంట‌ర్నెట్ బిల్లు, ఫోన్ బిల్లులు, పాల బిల్లు, పేప‌ర్ బిల్లు.. అని ర‌క ర‌కాల ఖ‌ర్చులుంటాయి. ఇంట్లో వృద్ధులు, పిల్ల‌లు, వ్యాధిగ్ర‌స్తులు ఉంటే వారి మెడిసిన్ల కోసం మ‌రింత ఖ‌ర్చ‌వుతుంది. ఇలాంటి స్థితిలో ఉద్యోగాల‌ను కోల్పోతే.. ప‌రిస్థితి ఎవ‌రికైనా అగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంది. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల దేశంలో ఉద్యోగాల‌ను కోల్పోతున్న చాలా మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. అయితే ఉద్యోగాన్ని కోల్పోవ‌డ‌మే కాకుండా.. నెల వ‌చ్చే సరికి సిద్ధంగా ఉండే ఖ‌ర్చులు.. ఇప్పుడు ఉద్యోగుల‌ను తీవ్ర‌మైన ఆందోళ‌న‌లోకి నెట్టేస్తున్నాయి. వారు తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు గురై.. మాన‌సిక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. విప‌రీత‌మైన ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముందు ముందు ఇలాంటి వారి ప‌రిస్థితి ఇంకా దారుణంగా త‌యార‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. మానసిక వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ దిశ‌గా ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌ని.. ఆర్థిక‌వేత్త‌లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా.. క‌రోనా.. స‌గ‌టు ఉద్యోగికి తెచ్చిన క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం.. వారికి బ‌తుకుల్లో తీవ్ర‌మైన వ్య‌థ నెల‌కొంది. అది ఎప్పుడు త‌గ్గుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news