ఓడిపోయారా? గెలిపించారా?

-

భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఒక ‘ముందస్తు అవగాహన’తో జరిగిందా? అవుననే అనిపిస్తోంది. పాకిస్థాన్‌ను సెమీస్‌కు రాకుండా ఇండియా గేమ్‌ ప్లాన్‌ ఇది అని పాక్‌ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌ జరుగుతూంటే, అదే సెమీస్‌లో లేకుంటే ఏం బాగుంటుంది అని బిసిసిఐకి ఐసీసీ అభ్యర్థన కూడా కావొచ్చని భారత అభిమానుల్లో ఏ మూలో ఓ సంశయం.

• ఓవర్‌కు 10 పరుగులు కావాల్సిన సమయం. క్రీజ్‌లో ధనాధన్‌ ధోనీ, హార్డ్‌ హిట్టర్‌ రిషభ్‌ పంత్‌. వాళ్లకు అది నిజానికి మామూలు విషయం. కానీ, రెండు,మూడు రావడమే గగనమైంది. ఎందుకు?
• స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై చాహల్ కెరీర్‌లోనే చెత్త బౌలింగ్‌ ఎందుకు చేసాడు?
• 40 నుండి 50 ఓవర్ల మధ్యలో 120కి పైగా పరుగులు ఇండియా చాలాసార్లు సాధించింది. ఇప్పుడేమైంది?
• ఆస్ట్రేలియాపై 359 పరుగులను, ఇదే ఇంగ్లండ్‌పై 350 పరుగులను, మళ్లీ ఆస్ట్రేలియాపై 350ని, 330ని.. ఇలా అనేకసార్లు చేధించిన భారత్‌ పటిష్టస్థితిలో ఉండి కూడా ఎందుకు సాధించలేకపోయింది?

ఇలాంటి అనుమానాలు కోకొల్లలుగా నిన్నటి మ్యాచ్‌లో కనిపించాయి. సాధారణంగా గెలుపు కోసం ఎంత కష్టపడతారో, టీం ఇండియా ఓడిపోవడానికి అంత కష్టపడిందని ఒక విశ్లేషకుడి అభిప్రాయం. అతన్కొడిదే కాదు, చాలామంది క్రికెట్‌ అభిమానులు ఇదే వాదనను ముందుంచారు.

సమీకరణాల ప్రకారం చూస్తే, నిన్న భారత్‌ గెలిచుంటే, సెమీస్‌ టేబుల్‌లోకి పాకిస్థాన్‌ 9 పాయింట్లతో చేరేది. ఇంగ్లండ్‌ 8 పాయింట్లతో మిగిలిపోయి, సెమీస్‌ ఆశలు అడుగంటిపోయేవి. ఆ తర్వాత జరిగే పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచినా, ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ఇంతే సంగతులు. పాక్‌ ఇంటిదారి పట్టాల్సిందే. ఇందుకే నిన్న భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు పూజలు చేసారు. ఒకవేళ న్యూజీలాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడితే, అప్పుడు పాక్‌ సెమీస్‌లో ప్రవేశిస్తుంది (బంగ్లాపై గెలిస్తేనే సుమా.!).

ఇలాంటి కండిషన్లలో భారత్‌ పాక్‌ను సెమీస్‌లో ప్రవేశించకుండా అడ్డుకోవాలనే ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయిందని పాక్‌ అభిమానులు ఆక్రోశం. మరోవైపు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా బిసిసిఐని రిక్వెస్ట్‌ చేసిందనేది ఇంకో ఆరోపణ. స్వదేశంలో కప్‌ ఆడుతూ, సెమీస్‌లో కూడా ప్రవేశించకుంటే ఇబ్బందులు (?) తలెత్తుతాయని ఈసీబీ భావన. మ్యాచ్‌లు ఆదరణ కోల్పోవడంతో పాటు ఆదాయానికి కూడా గండిపడుతుందని ఈసీబీ, ఐసీసీ బెంగ. అందుకే అనధికారికంగా ‘సైగలు’ చేసుకున్నారని ఇంగ్లండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారత్‌ కూడా తాము శాయశక్తులా పోరాడినా ఓడామని నిరూపించడానికి అపసోపాలు పడుతోంది. 306 పరుగులు చేయడమే అందుకు సాక్ష్యమని బల్ల గుద్దుతోంది. కానీ అదే 306 చేసినవాళ్లకు 30 రన్స్‌ ఏ విధంగా ఎక్కువయ్యాయో చెప్పాలని అభిమానుల వాదన. 2017లో ఇదే ఇంగ్లండ్‌పై 350 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తూ 356 చేసిన భారత్‌ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించి, ఫటాఫట్‌ సెంచరీ కొట్టిన కేదార్‌ జాదవ్‌ ఇక్కడా క్రీజ్‌లో ఉన్నాడు. దూకుడుగా తప్ప, మెల్లగా ఆడలేని పంత్, పాండ్యాలను కంట్రోల్‌ చేయడానికి రోహిత్‌, ధోనీ నానా పాట్లు పడ్డారు పాపం.

ఏదేమైనా భారత్‌పై అన్నిదేశాల అభిమానులకు బోలెడంత నమ్మకమయితే ఉందని రుజువైంది. ఇక పాక్‌ అభిమానులు న్యూజీలాండ్‌ను నమ్ముకుంటే బెటర్‌.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news