ఎడిట్ నోట్: మళ్ళీ తగువులాట..!

ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక…ఏదొక విషయంలో ఏపీ-తెలంగాణల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. గతంలో టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడిచేది. తెలంగాణలో ఏమో టీఆర్ఎస్, ఏపీలో ఏమో టీడీపే అధికారంలో ఉన్నప్పుడు..రెండు రాష్ట్రాల మధ్య ఏదొక అంశంపై గొడవ రాజుకుంటూనే ఉండేది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పెద్ద రచ్చ జరిగింది. అలాగే నీటి వాటాలు, విభజన హామీలు, కరెంట్ వాడకం ఇలా అనేక సమస్యలపై రగడ నడిచింది.

ఇక తర్వాత తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ఇటు ఏపీలో ఏమో వైసీపీలోకి రావడంతో..ఈ సారి ఎలాంటి గొడవలు ఉండవని అంతా అనుకున్నారు. కేసీఆర్-జగన్ బాగా సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి విభేదాలు ఉండవని అనుకున్నారు. కానీ వీరి మధ్య కూడా ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధమే జరిగింది.

అయితే ఇక్కడ చెప్పాలసిన విషయం ఏంటంటే..ప్రత్యేకంగా ఏపీకి చెందిన అధికార నేతలు..ఎప్పుడు కూడా తెలంగాణపై కామెంట్లు చేయలేదు. కానీ తెలంగాణకు చెందిన అధికార టీఆర్ఎస్ నేతలు ఏదొక సందర్భంలో ఏపీని తీసుకొచ్చి విమర్శలు చేసేవారు. ఏపీలో రోడ్లు బాగోలేదని, ఏపీ అప్పులు పాలైందని, అక్కడ కరెంట్ సరిగ్గా ఉండటం లేదని, అలాగే ఏపీ కంటే తెలంగాణలో భూములు రేట్లు పెరిగాయని, అభివృద్ధి విషయంలో ఏపీకి అందనంత ఎత్తులో తెలంగాణ ఉందని చెప్పి..టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో కామెంట్ చేస్తూ వచ్చారు. అంటే ఏపీతో పోలిస్తే అన్నీ విషయాల్లో మనం మంచి పొజిషన్‌లో ఉన్నామని చెప్పడానికి టీఆర్ఎస్ నేతలు..పదే పదే ఏపీతో పోల్చి చెప్పేవారు.

ఆ మధ్య కూడా భద్రాచలం వరదముంపుకు గురైనప్పుడు..పోలవరం వల్లే ఈ ముంపు అని తెలంగాణ మంత్రులు మాట్లాడారు. అలాగే ఏపీలో కలిపిన ముంపు మండలాలు మళ్ళీ తమకుయి తిరిగిచ్చేయాలని మాట్లాడారు. ఇక తెలంగాణ నేతల మాటలకు ఏపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ముంపు మండలాలు ఇవ్వాలని అంటున్నారు..అలా అంటే హైదరాబాద్‌లో తమకు వాటా ఇవ్వాలని ఏపీ మంత్రులు మాట్లాడారు.

ఇలా రచ్చ జరుగుతుండగానే..తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు..టీచర్లకు సంబంధించి మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుంటే…తెలంగాణలో మాత్రం ఐదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, అలాగే అక్కడ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని మాట్లాడారు. దీనికి ఏపీ అధికార నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. దమ్ముంటే ఇక్కడకు వచ్చి టీచర్లని అడగొచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ..హరీష్‌కు కౌంటర్ ఇచ్చారు. అలాగే తమకు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలు వస్తే ఇంకా టీచర్లకు ఎక్కువ మేలు చేసే వాళ్ళమని మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తాము తెలంగాణ ప్రభుత్వంపై దాడిచేస్తామని హరీశ్‌రావు భావిస్తున్నట్లుగా ఉన్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తన మేనమామ కేసీఆర్‌తో ఆయన ఏమైనా గొడవలు ఉంటే నేరుగా చూసుకోవాలని సూచించారు. ఇక ఏపీ మంత్రులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. హరీష్ వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమే అని, వైఎస్సార్ ఆశయాలని తుంగలో తొక్కింది జగన్ గ్యాంగే అని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఇలా రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ రగడ మొదలైంది..మరి ఈ సారి ఎలాంటి రాజకీయ లబ్ది కోసం రచ్చ రేగిందో చూడాలి.