తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..తమ సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఈ పరిస్తితి కనిపిస్తోంది. సొంత నేతలపైనే తిరగబడే పరిస్తితి కనిపిస్తోంది. మామూలుగా కాంగ్రెస్ పార్టీలో రచ్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఆ పార్టీలోని నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుని విమర్శలు చేసుకుంటారు. ఈ మధ్య పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ అయింది.
తమకు సరైన పదవులు ఇవ్వలేదని చెప్పి కొందరు సీనియర్లు రాజీనామాలు చేశారు..అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయినా సరే సీనియర్ వర్గం…రేవంత్ వర్గంపై గుర్రుగానే ఉంది. ఇంకా వారు సెపరేట్ గా సమావేశమై..ఈ అంశాన్ని అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అటు అధిష్టానం కూడా ఈ సమస్యలని పరిష్కరించాలని చూస్తుంది.
ఇక కాంగ్రెస్ లో పరిస్తితి అలా ఉంటే…బీఆర్ఎస్‌లో ఓ రచ్చ నడుస్తోంది. మంత్రి మల్లారెడ్డి వైఖరికి నిరసనగా ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, భేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీలు సెపరేట్ గా సమావేశమై..మల్లారెడ్డి తీరుని బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు కావల్సిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు.
ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో జరుగుతున్న రచ్చ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలతో బీజేపీ టచ్ లో ఉంది. వారిని బీజేపీలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్యేల వెనుక ఎవరు ఉన్నారనేది క్లారిటీ లేదు. వారిపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్‌కు చెప్పకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు సెపరేట్ గా సమావేశం పెట్టుకునే వరకు వెళ్లారంటే దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందని తెలుస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.