ఎడిట్ నోట్ : టీడీపీ లాభాల‌ను వైసీపీ లాగేసుకుందా ? ఆర్ఆర్ఆర్

రెండు వేర్వేరు సినిమాలు
రెండు వేర్వేరు పార్టీలు
సినిమాల‌కు డైరెక్ట‌ర్ ఒక్క‌రే
కానీ సీఎంలు మాత్రం మారిపోయారు
ఆరోజు చంద్ర‌బాబు ఈ రోజు జ‌గ‌న్
ఇద్ద‌రూ సినిమా విష‌య‌మై బ్లాక్ మార్కెట్
దందాను నియంత్రించ‌లేక‌పోయారు
ఇద్ద‌రూ పైర‌సీని నిలువ‌రించ‌లేకపోయారు
ఇద్ద‌రూ ఆ రెండు సినిమాల‌కూ ఎంతో సాయం చేసి
సంబంధిత వ‌ర్గాల‌ను మాత్రం ఆనంద‌ప‌రిచారు
అయితే ఆ రోజు లాభాల్లో వాటా టీడీపీది అని కొంద‌రు
ఇప్పుడు లాభాల్లో వాటా వైసీపీది అని ఇంకొంద‌రు
అంటున్నారు..విమ‌ర్శిస్తున్నారు. ఆధారాలు కూడా ఉన్నాయ‌ని
అంటున్నారు.. అవే బాహుబ‌లి (ఒక‌టి,రెండు భాగాలు), ట్రిపుల్ ఆర్
సినిమాలు….

ysrcpandtdp
ysrcpandtdp

బాహుబ‌లి మొద‌టి భాగం 2015,జూలై ప‌దిన విడుద‌లైంది. ఆ సినిమా సంచ‌ల‌నం అయింది. అనూహ్య విజ‌యం అందుకుని, ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలోనే వ‌సూళ్లు చేసింది. ఆ సమ‌యంలో నిర్మాత‌లు తాము పెట్టిన పెట్టుబ‌డికి మూడు రెట్లు లాభం అందుకుని ఆనందించారు.

ముందుగా అనుకున్న ఒప్పందాల ప్ర‌కారం లాభాల్లో వాటా వ‌చ్చింది. ఏ విధంగా చూసుకున్నా రాజ‌మౌళి ఆ సినిమా (మొద‌టి భాగం)తోనే నూట యాభై కోట్లు ఆర్జించి ఉంటారు. రెమ్యున‌రేష‌న్ తో క‌లుపుకుని..ఆ త‌రువాత రాజ‌మౌళి ఆస్తుల విలువ పెరిగింది. అది కూడా అంద‌నంత ఎత్తులోనే ఉంది ఇవాళ. త‌రువాత రెండో భాగం కూడా మంచి లాభాల‌నే అందుకుంది. ఆ విధంగా రాజ‌మౌళి అండ్ కో మ‌ళ్లీ సేఫ్ !

సినిమాకు సంగీతం అందించిన కీర‌వాణికి కూడా లాభాల్లో వాటా ద‌క్కింది. ఆ విధంగా ఆయ‌న కెరియ‌ర్లో ఎన్న‌డూ లేనంత డ‌బ్బు ఆయ‌న ఖాతాల్లో వ‌చ్చి ప‌డింది. మిగ‌తా టెక్నీషియ‌న్లు కూడా ఆశించిన దాని క‌న్నా బాగానే లాభప‌డ్డారు. లాభాల్లో వారికి వాటాలు ఇవ్వ‌కున్నా కూడా రెమ్యున‌రేష‌న్ల ప‌రంగా హాయిగా వారు ఊహించిన దాని క‌న్నా ఎక్కువే ముట్టజెప్పారు. సినిమాకు వినోద‌పు ప‌న్ను భారీ స్థాయిలోనే ఎగ‌వేత చేశార‌ని ఆ మ‌ధ్య ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ లెక్క‌ల‌న్నీ తీస్తామ‌ని కూడా రాజ‌మౌళి బృందాన్ని బెదిరించారు. ఆ త‌రువాత ఏమ‌యిందో కానీ ఆయ‌న సైలెంట్ అయిపోయారు.

వాస్త‌వానికి బాహుబ‌లి డ‌బ్బుల‌లో కొంత టీడీపీ నాయ‌కుల‌కు కూడా వెళ్లాయ‌ని అంటారు. ఇది ఒక ఆరోప‌ణ మాత్ర‌మే! ఇప్పుడు టిక్కెట్ల‌ను ఏ విధంగా అయితే బ్లాక్ లో అమ్ముకుంటున్నారో ఆ వ‌ర్గాలే ఆ రోజూ ఉన్నాయి. అప్పుడు డ‌బ్బులు టీడీపీ వెళ్లాయి ఇప్పుడు వైసీపీకి వెళ్తున్నాయి అన్న‌ది ఓ ప్ర‌ధాన అభియోగం. ఇందులో కొంత వాస్త‌వం ఉన్నా కూడా ఇప్పుడేం చేయ‌లేం.

అప్పుడూ ఏం చేయ‌లేక‌పోయాం. ఓ విధంగా థియేట‌ర్ మాఫియా దగ్గ‌ర సామాన్యుడు ఓడిపోతాడు అనేందుకు ఉదాహ‌ర‌ణ బాహుబ‌లి మ‌రియు ట్రిపుల్ ఆర్ సినిమాలే! వాస్త‌వానికి జ‌గ‌న్ ఆలోచ‌న బాగానే ఉన్నా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు వెసులుబాటు ఇవ్వాల‌ని రాజ‌మౌళి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో మొద‌టి రోజే మూడు వంద‌ల కోట్లు (ప్ర‌పంచ వ్యాప్తంగా) వ‌చ్చేశాయి.ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా కూడా చాలా బాగుంది. క‌నుక రాజ‌కీయం ఎలా ఉన్నా కూడా ల‌బ్ధి పొందింది రాజ‌మౌళి అండ్ కో మాత్ర‌మే! అన్న‌ది ఇవాళ సుస్ప‌ష్టం.

నిన్న‌టి వేళ బ్లాక్ లో విప‌రీతంగా టిక్కెట్లు అమ్ముడుపోయినా రెవెన్యూ మ‌రియు పోలీసు యంత్రాంగం ఏమీ చేయ‌లేక పోయింద‌న్న‌ది జ‌న‌సేన విమ‌ర్శ. విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా ఒక్కో టికెట్ ఐదు వంద‌ల నుంచి ఐదు వేల వ‌ర‌కూ అమ్ముడుపోయింద‌ని, అయినా కూడా సంబంధిత అధికారులు బ్లాక్ మార్కెట్ దందాను నిలువ‌రించ‌లేక‌పోయార‌న్న‌ది వారి వాద‌న. ఒక‌వేళ ఇవాళ టీడీపీ క‌నుక అధికారంలో ఉంటే ఆ లాభాలు అన్నీ సంబంధిత నాయ‌కుల జేబుల్లోకి చేరేవే అని..ఆ విధంగా కాకుండా అధికార ప‌క్షంలో జ‌గ‌న్ పార్టీ ఉండ‌డంతో టీడీపీ లాభాల‌ను వైసీపీ గుంజుకుంద‌ని కొంద‌రు జ‌న‌సేన ప్ర‌తినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.