ఎడిట్ నోట్: సూపర్ స్టార్ సినీ-రాజకీయ ప్రస్థానం..!

-

ఆకాశంలో ఒక తార అంటూ తెలుగు ప్రజల మధ్యలో ఓ సూపర్ స్టార్‌గా ఎదిగిన నతశేఖరుడు కృష్ణ…ఆకాశంలో తారలతో కలిసిపోయారు.  టాలీవుడ్ కౌబోయ్, తెలుగు తెర ‘అల్లూరి’, ‘దేవుడులాంటి మనిషి’.. సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. కృష్ణ మరణంతో యావత్ తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీలో తనయుడు రమేష్ బాబు, విజయనిర్మల, ఇందిరా దేవి మరణించారు..ఇప్పుడు కృష్ణ మృతి చెందారు.

ఇక నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదిగిన కృష్ణ..350కి పైగా చిత్రాల్లో నటించి..తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కృష్ణ తొలి చిత్రం అనగానే అందరికీ తేనెమనసులు (1965) చిత్రం గుర్తొస్తుంది. కానీ.. అంతకుముందే ఆయన కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత తేనెమనసులు (1965) చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు.

సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు)..లాంటి రికార్డులు కృష్ణ చేతుల్లోనే ఉన్నాయి.

Superstar and actor Mahesh Babu's father Krishna suffers cardiac arrest, admitted in ICU

అనేక అవార్డులు, రివార్డులు అందుకుని పద్మభూషణుడుగా మిగిలారు. ఎన్టీఆర్‌తో సినీ రంగంలోనే కాదు..రాజకీయాల్లోనూ పోటీ పడ్డారు. ఓ వైపు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సత్తా చాటుతున్న నేపథ్యంలోనే..కృష్ణ కాంగ్రెస్ లో చేరి సత్తా చాటారు. రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరి..1989 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

తర్వాత రాజీవ్ గాంధీ హత్యతో 1991లో మధ్యంతర ఎన్నికలు రాగా, అప్పుడు మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక నిదానంగా రాజకీయాలకు దూరం జరుగుతూ వచ్చిన కృష్ణ, 2004-2009 సమయంలో వైఎస్సార్‌కు మద్ధతు ఇచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత కృష్ణ రాజకీయాల వైపుకు పెద్దగా వెళ్లలేదు. అలా రాజకీయ ప్రస్థానం ముగిసింది.

కుటుంబం విషయానికొస్తే.. గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 31మే, 1943న తొలి సంతానంగా కృష్ణ జన్మించారు. హనుమంతరావు, నిర్మాత ఆదిశేషగిరిరావులు కృష్ణ సోదరులు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు 5 గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. పెద్దకొడుకు రమేష్ బాబు తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించి, అనంతరం నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రెండో కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె పద్మావతి.. అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య. రెండో కుమార్తె మంజుల దర్శకనిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మూడో కుమార్తె ప్రియదర్శని హీరో సుధీర్ బాబు భార్య.

తెలుగు సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచి నటశేఖరుడు కృష్ణ దివికేగారు. కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news