మహర్షి టికెట్ల ధ‌ర‌ల పెంపు.. దోచుకోవడానికేనా?

-

షోలు పెంచి, టికెట్ల ధ‌ర‌లు పెంచి త‌క్కువ టైమ్‌లో సొమ్ముని, అధిక లాభాలు రాబ‌ట్టుకోవ‌డం ఓ ఎత్తైతే, సినిమా ఫ‌లితం తారుమారుగా ఉన్న నేప‌థ్యంలో మొద‌టి వీకెండ్‌లోనే సాధ్య‌మైనంత వ‌ర‌కు తాము పెట్టిన బ‌డ్జెట్‌ని వెన‌క్కి తెచ్చుకోవ‌డం మ‌రో ఎత్తు.

ఇటీవ‌ల కాలంలో పెద్ద సినిమాలు విడుద‌లవుతున్నాయంటే చాలా వ‌ర‌కు టికెట్ల రేటుని పెంచ‌డం, షోల‌ని పెంచ‌డం చేస్తున్నారు. బాహుబ‌లికి ఇలానే పెంచారు. ఖైదీ నంబ‌ర్ 150, భ‌ర‌త్ అనే నేను వంటి సినిమాల‌కు ఐదు షోలు వేశారు. టికెట్ల ధ‌ర‌లు పెంచారు. మ‌రి ఇలా పెంచ‌డం ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

షోలు పెంచి, టికెట్ల ధ‌ర‌లు పెంచి త‌క్కువ టైమ్‌లో సొమ్ముని, అధిక లాభాలు రాబ‌ట్టుకోవ‌డం ఓ ఎత్తైతే, సినిమా ఫ‌లితం తారుమారుగా ఉన్న నేప‌థ్యంలో మొద‌టి వీకెండ్‌లోనే సాధ్య‌మైనంత వ‌ర‌కు తాము పెట్టిన బ‌డ్జెట్‌ని వెన‌క్కి తెచ్చుకోవ‌డం మ‌రో ఎత్తు. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల జేబుల‌కే చిల్లు ప‌డుతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్పటికే మహర్షి తేడా కొట్టేట్టుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల గుసగుసలు.

స్టార్ హీరో ఇమేజ్‌ని, వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకునేందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకి కూడా టికెట్ల ధ‌ర‌లు, షోలు పెంచారు. రోజుకి ఐదు షోలు ప్ర‌ద‌ర్శించేలా తెలంగాణ ప్ర‌భుత్వం, కోర్టు అనుమ‌తినిచ్చింది.

హైదరాబాద్‌లోని పలు థియేటర్ల యాజమాన్యాలు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.80 టికెట్‌ ధరను రూ.110కి పెంచారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై ఉన్న‌దానికి ఎక్స్ ట్రా రూ.50 పెంచారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్‌ ధరను రూ.200కి పెంచారు. రేట్లు పెంచుకోవడానికి తమకు కోర్టు అనుమతినిచ్చిందని ఎగ్జిబిటర్ల వాదన. ఎక్కువ బడ్జెట్‌ సినిమాలను ఎక్కువ రేటుకు కొంటున్నందున, తమకు పాత రేట్లు గిట్టుబాటు కావని, కొన్ని రోజులపాటు టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని ‘బాహుబలి’ టైంలో కోరినప్పుడు కోర్టు పర్మిషన్‌ ఇచ్చిందని, దాన్నే ఇప్పుడు కూడా వాడుకుంటున్నామని ఎగ్జిబిటర్లు తెలిపారు.

అయితే, ‘మహర్షి’ సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పందించారు. టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పడం గమనార్హం. తాజాగా తెలంగాణలో ఈ సినిమా ఐదు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  దీంతో మే 9 నుంచి మే 25 వరకు ఐదు షోలను ప్రదర్శించబోతున్నారు.

అంటే, బడ్జెట్‌ 1000కోట్లు దాటితే, టికెట్‌ ధర 1000 రూపాయలు పెడతారా? ఇదేం పద్ధతి అంటూ ప్రేక్షకులు తిట్లదండకం అందుకుంటున్నారు. నిజానికి టికెట్ ధర పెంచాలంటే ప్రభుత్వం ఒక కమిటీ వేసి, దాని నివేదిక ఆధారంగా పెంచాల్సివస్తే, పెంచుతూ ఉత్తర్వులిస్తుంది. ఇక్కడ కోర్టు ప్రస్తావన ఎందుకొచ్చిందో, అసలు కోర్టు ఆర్డరులో ఏముందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా ప్రజల మేలు కోరే ప్రభుత్వాలు, కోర్టులు ఇంత బాధ్యతారాహిత్యంగా ఎందుకున్నాయో అర్థం కావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version