తప్పెవరిది.. శిక్ష ఎవరికి.. జల్సా రాయుళ్ల నిర్లక్ష్యం – యువ ఇంజనీర్‌ బలి

-

ఇద్ద‌రి యువ‌కుల విన్యాసం.. ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ఓ కుటుంబంలో తీర‌ని చిచ్చు రేపింది. ఆ కుటుంబం ఆశ‌ల‌ను చిదిమేసింది. త‌మ కుమారుడు ఉన్నతోద్యోగం చేసి.. త‌మ‌కు, కుటుంబానికి ఆస‌రాగా నిలుస్తాడ‌ని భావించిన ఆ కుటుంబం నేడు క‌న్నీటిలో మునిగిపోయింది. దీనికంత‌టికీ కార‌ణం.. ఓ ఇద్ద‌రు చేసిన ర‌హ‌దారి విన్యాసం. వారి నిర్ల‌క్ష్యం! ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నా.. మార‌ని మ‌న దూకుడు! ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై కొర‌డా ఝ‌ళిపిస్తున్నాయి. అయినా కూడా ప‌రిస్థితుల్లో మాత్రం మార్పు రావ‌డం లేదు.

ఓ ఇద్ద‌రు యువ‌కుల అతివేగం.. దూకుడు.. కారణంగా యువ‌కుడి నిండు ప్రాణాలు గాలిలో క‌లిసిపోయా యి. దీంతో ఆ యువ‌కుడి కుటుంబంలో క‌న్నీటి వ‌ర‌ద పారుతోంది. విష‌యంలోకి వెళ్తే.. ఢిల్లీ స‌మీపంలోని గుర్‌గావ్ ప్రాంతానికి చెందిన వేద్ ప్ర‌కాష్ ఖాత్రీ(30) సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌. ఆ కుటుంబానికి ఆయ‌న ఆశాజ్యోతి. ఇన్నాళ్లు ఆ కుటుంబం ప‌డిన క‌ష్టాల‌ను తుడిచేసి.. త‌న‌కు వ‌చ్చే ఆదాయంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని, త‌న త‌ల్లిదండ్రుల‌ను ఆనందంలో ముంచెత్తాల‌ని అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే ఓ ఇద్ద‌రు యువకుల నిర్ల‌క్ష్యానికి ఏ పాపం ఎరుగ‌ని ఖాత్రీ బ‌లై పోయారు.

ఢిల్లీ గుర్గావ్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే వేద్‌ ప్రకాష్‌ తమ సొంత ఊరు ఘ‌జియా బాద్‌లోని మోదీన‌గ‌ర్ తల్లిందడ్రులను చూడటానికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో నడుస్తూ వెళ్తున్న వేద్‌ ప్రకాష్‌ ఖత్రీని ఉన్నట్టుండి హోండా సిటీ కారు ఢీకొట్టింది. కారు రేస్‌ పెట్టుకున్న రెండు కార్లలో ఒక కారు వేద్‌ ప్రకాష్‌ని బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో రోడ్డుపై ప‌డిపోయిన ఖాత్రీకి బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. దీంతో ఆయ‌న‌ను స‌మీపంలోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్ర‌థ‌మ చికిత్స అందించారు. అనంత‌రం మ‌రింత మెరుగైన వైద్యం కోసం మోదీ న‌గ‌ర్‌లోని య‌శోదా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అయితే, న‌రాలు చిట్లి పోవ‌డం, ర‌క్తం ఎక్కువ‌గా కారిపోవ‌డంతో వైద్యులు చేసిన చికిత్స ఫ‌లించ‌లేదు. దీంతో మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున ఆసుప‌త్రిలోనే ఖాత్రీ తుదిశ్వాస విడిచారు. ఈ ఘ‌ట‌న‌తో ఖాత్రీ కుటుంబం మ్రాన్ప‌డిపోయింది. త‌మ కుమారుడు ఎన్నో క‌ష్టాలు ప‌డి చ‌దువుకున్నాడ‌ని, ఇలా కుటుంబానికి ఆస‌రాఅయ్యే స‌మ‌యానికి త‌మ‌కు కాకుండా పోయార‌ని వారు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. ఇలాంటి దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న ఏ కుటుంబానికీ రాకూడ‌ద‌ని వారు కోరుకున్న తీరు అంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది. ఒక‌రి ఎంజాయ్‌మెంట్ మ‌రొక‌రి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణం అవ్వ‌డంతో ఆ కుటుంబంలో చీక‌ట్లు నింపేసింది. ఎవ‌రో చేసిన త‌ప్పుకు ఎవ‌రో బ‌ల‌వుతుంటారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప‌రిధుల్లో జాగ్ర‌త్త‌గా ఉంటే ఇలాంటి ప్ర‌మాదాలు రావు.

ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లకు కఠినంగా శిక్షించాలని #JusticeForVed అంటూ వేద్‌ సహచరులు చేస్తున్న ఉద్యమానికి మనలోకం మద్దతు తెలుపుతుంది. ఏం పాపం చేశాడని వేద్‌ బలి కావాలి.. ఒకరి సంతోషం కోసం మరో కుటుంబం బాధపడాలా..? ఇలాంటివాటిని ఉపేక్షించకూడదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే అందరూ దారికొస్తారు. #JusticeForVed

Read more RELATED
Recommended to you

Latest news