‘ విద్యార్థులు మారుతున్నారు. పాఠ్యాంశం, పాఠం మాత్రం అదే ఉంటున్నది సేమ్ టు సేమ్. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే..ఇంత సుధీర్ఘమైన కాలంలో.. నేను మొదటిసారి పోయి పాఠం ఎట్లయితే చెప్పిన్నో ఆ పాఠశాలలో అది గట్లనే ఉన్నది.. గదే కుర్చి కున్నది.. గదే బెంచి ఉన్నది. గట్లనే ఉన్నది గదొక్కటే గది. ఏమీ మారలె. మారిందల్లా ఒక్కటే.. మారింది. ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ రాష్ట్రం అయింది ఆ స్కూల్ బోర్డుమీద. మా రాజేందరన్నకు నాకేమో ఒక్కొక్కసారి వాస్తవాలు మాట్లాడుకోకపోతే పొట్ట ఊకోదు.. ఇవతలికి రా అట్టంది.. ఎందుకంటే మీమంతా ఉద్యమాల నుంచి వచ్చినవాళ్లం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలో కలలుగన్నవాళ్లం.. ఒక్కోసారి బాధపడ్డాం ‘ అని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ లో గురువారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు రాజకీయవర్గాల్లో రసమయి మాటలు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా మాట్లాడడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాటి ప్రభుత్వ పాఠశాల ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నదంటూ రసమయి అన్న మాటలు పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవేనని, పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాము ఉద్యమాల నుంచి వచ్చినవాళ్లమంటూ.. రసమయి పరోక్షంగా ధిక్కార స్వరం వినిపించారని పలువురు నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయి.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంతే.. ఏమీ మారలేదు.. ఆ స్కూల్ బోర్డుమీద అంటూ రసమయి నర్మగర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారనే కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కోసారి తాము ఎంతో బాధపడ్డామని కూడా రసమయి చెప్పడం గమనార్హం.
అయితే.. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే వేదికపై మంత్రి ఈటల ఉండడం, రసమయిని జాగ్రత్తగా మాట్లాడమని నవ్వుతూ చెప్పడం గమనార్హం. మొన్నటికి మొన్న మంత్రి ఈటల రాజేందర్ పేల్చిన మాటల తూటాల పరంపరలోనే ఎమ్మెల్యే రసమయి కూడా తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాలతోపాటు సామాన్య ప్రజల్లోనూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ మొన్న ఈటల చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రసమయి బహిరంగంగానే సమర్థించారని చెప్పొచ్చు. మొత్తానికి అధికార టీఆర్ఎస్‌లో ఏదో ముసలం మొదలైందని, అది ఉద్యమాల జిల్లా, గులాబీ కోటగా భావించే కరీంనగర్ నుంచే మొదలైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఎలా ? స్పందిస్తుందో చూడాలి మరి.