వైసీపీ కాపు నేత‌ల్లో కాక పుడుతోందా… కార‌ణం అదేనా..?

-

ఎడతెగని వివాదంగా మారిన కాపు రిజర్వేషన్‌ అంశం.. రాజకీయ రంగు పులుముకున్న విషయం ఇప్పుడు ఏపీలో చర్చకు దారితీస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు 5% రిజర్వేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. కాపులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమించారు. అయితే, అప్పట్లో ఈ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కాపు నాయకులను నిర్బంధించింది. అనేక కేసులు పెట్టింది. ముఖ్యంగా ఉద్యమ నాయకుడు ముద్రగడ కుటుంబంపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి.అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు.

Kapu Reservation Stir Rages Political Heat in Ysrcp

ఇంతలోనే అనుభవం ఉన్న నాయకుడు అనుకున్న చంద్రబాబు కాపులకు అటు బీసీల్లోనూ, ఇటు అగ్రవర్ణ పేదల్లోనూ రిజర్వేషన్ కల్పించి తాను కాపు పక్షపాతిగా ఉన్నానంటూ.. చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, ఇవి రెండూ కూడా అలివిమాలిన హామీలుగానే మిగిలిపోయాయి.దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించక పోగా.. సమస్య ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. దీంతో తాజాగా ప్రభుత్వంలోకి వచ్చిన వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి ఉద్యమించాలని కాపు నాయకులు శతవిధాలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

వైసీపీలో ప్రస్తుతం 30 మంది వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిపై ఒత్తిడి తెచ్చయినా సరే తమ రిజర్వేషన్‌ సాధించాలని నిర్ణయించుకోవడం హాట్‌ హాట్‌గా మారింది. దీంతో ఇప్పుడు వైసీపీ కాపు నేత‌ల‌కు ముందు నుయ్యి… వెన‌క గొయ్యి చందంగా మారింది. త‌మ‌పై త‌మ కుల‌పు వాళ్ల ఒత్తిడి చేస్తుండ‌డంతో వీళ్ల‌లో హీట్ పెరుగుతోంది. కానీ, చిత్రమైన విషయం ఏంటంటే. ప్రస్తుతం టీడీపీ నాయకుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ వంటి వారు అప్పట్లో చంద్రబాబు చేసిన జిమ్మిక్కులను ప్రశ్నించకపోవడం గమనార్హం. ఒకపక్క బీసీల్లో 5శాతం కోటా ఇస్తూనే.. మరోపక్క, అగ్రవర్ణ పేదల్లోనూ ఆయన అవకాశం కల్పించారు. ఈ ద్వంద్వ విధానం అమలు కాదని తెలిసి కూడా మౌనం వహించారు.

ఇప్పుడు ఒక క్లారిటీతో కాపులకు న్యాయం చేస్తామని చెబుతున్న ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని, నిలదీస్తామని చెప్పడం సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. అటు అగ్రవర్ణ పేదల్లో అందరితోపాటు రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు రూ.2 వేల కోట్లను ఏటా కేటాయించడం ద్వారా వారికి న్యాయం చేస్తామంటున్న జగన్‌ను స్వాగతించడమే ఇప్పుడు కాపుల ముందున్న ప్రదాన లక్ష్యం. అయితే, అదే సమయంలో బీసీల్లోనే రిజర్వేషన్‌ కోరుకుంటున్నప్పుడు కేంద్రంలో ఎలాగూ.. చంద్రబాబు చేసిన తీర్మానం ఉంది కాబట్టి.. దీనిపై పోరాటం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news