ప్లాస్టిక్ నిషేధం సాధ్యమేనా.. మోడీ ప్లాన్ స‌క్సెస్ అవుతుందా..!

-

ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాటిలో ఒకటిగా ఉన్న నగరాలు మరియు గ్రామాల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న 12 ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించారు.

అందులో జెండాలు, బెలూన్లు, ఇయర్ బడ్స్, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సంచులు, ప్లాస్టిక్ షీట్లు అతికించి చేసిన ప్లేట్లు, గిన్నెలు, చిన్ని కప్పులు, ఫోమ్డ్ ప్లేట్లు, కప్పులు, అల్లికలేని బ్యాగులు, చిన్న ప్లాస్టిక్ సీసాలు, ప్యాకింగ్‌కు ఉపయోగించే చిన్న తరహా షీట్లు, థర్మాకోల్ వస్తువులను నిషేధించాలని ప్రకటించారు.

అయితే ఇది ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుందో తెలియ‌దు. వాస్త‌వానికి సముద్రంలో తేలియాడే చెత్తలో 90% ప్లాస్టిక్కే. 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మహా సముద్రాలలో చేరింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఈ చెత్త రెట్టింపు అవుతోంది. స‌ముద్రంలో ఉన్న జీవ‌రాశుల‌ను ఈ ప్లాస్టిక్ అంతం చేస్తుంది. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. పాలు, కూరగాయలు, టిఫిన్, భోజనం ఏది తేవాలి అన్న ప్లాస్టిక్ కవర్లు కావాల్సిందే. గ్రామాల నుంచి నగరాల వరకు అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది.

గతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని జీహెచ్ఎంసీ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. అయితే ఆ సంకల్పం కొద్ది రోజుల వరకే అమలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాలిథిన్‌ కవర్లతో కలుగుతున్న నష్టాలపై 2016లో కేంద్ర ప్ర‌భుత్వం ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు రూపొందించింది. దీన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసినా కానీ ఎలాంటి ఫ‌లితం లేదు.

అయితే ఇటీవ‌ల 12 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది.సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సూచన మేరకు ఈ జాబితాను సిద్దపరిచింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను పూర్తిగా నిషేధిస్తామని, దీన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news