కోవిడ్ టీకాల కేంద్రాల వద్ద జ‌నాల అరిగోస‌.. పెల్లుబుకుతున్న జ‌నాగ్ర‌హం..

-

దేశంలో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారికి టీకాల‌ను వేస్తామ‌ని కేంద్రం ఎప్పుడైతే ప్ర‌క‌టించిందో అప్ప‌టి నుంచి టీకాల పంపిణీపై గంద‌ర గోళం నెల‌కొంది. మొద‌ట కోవిన్ యాప్ స‌హా ఇత‌ర వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ యాప్‌లు, సైట్‌లు ప‌నిచేయ‌లేదు. త‌రువాత టీకాల కొర‌త కార‌ణంగా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న‌వారికి అనేక రాష్ట్రాల్లో టీకాల‌ను ఇవ్వ‌డం లేదు. కేవ‌లం రెండో డోసు టీకాల‌ను మాత్ర‌మే ఇస్తున్నారు. ఇక అవైనా స‌రిగ్గా పంపిణీ చేస్తున్నారా ? అంటే.. లేదు. అస‌లు రెండో డోసు టీకాల‌ను ఎక్క‌డ తీసుకోవాలో ప్ర‌జ‌ల‌కు అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

people chaos at covid vaccination centers across india

దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల‌కు కొర‌త ఏర్ప‌డ‌డంతో కేంద్రాల వ‌ద్ద జ‌నాలు అరిగోస ప‌డుతున్నారు. ఉద‌యం 5 గంట‌ల‌కే కేంద్రాల వ‌ద్ద‌కు చేరుకుని కోవిడ్ రెండో డోసు కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. అంత సేపు వేచి చూసినా టీకా దొరుకుతుందా, అస‌లు టీకా వేస్తారా ? అంటే క‌ష్ట‌మే. టోకెన్లు ఇచ్చి వెన‌క్కి పంపుతున్నారు. దీంతో మొద‌టి డోసు తీసుకుని రెండో డోసు కోసం స‌మయం గ‌డిచిపోయిన వారు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆధార్ కార్డుల‌ను తీసుకోవాల‌ని, లేదంటే గ్యాస్ స‌బ్సిడీ రాద‌ని యావ‌త్ భార‌త ప్ర‌జానీకాన్ని రోడ్డుపై ఆధార్ కేంద్రాల వ‌ద్ద నిల‌బెట్టారు. ఆధార్ పొంద‌డం అప్ప‌ట్లో ఒక ప్ర‌హ‌స‌నంగా మారింది. ఇక మోదీ గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు జ‌నాల విల‌విలలాడారు. ఉన్న నోట్ల‌ను మార్చుకునేందుకు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో నిల‌బ‌డ‌లేక అసువులు బాశారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

కోవిడ్ టీకాల‌ను త‌గినంత స‌ర‌ఫ‌రా చేయాల‌ని ముందుగా ప్ర‌భుత్వాల‌కు తెలియ‌దా ? అస‌లు జ‌నాభా ఎంత ఉంది ? ఎన్ని టీకాలు అవ‌స‌రం అవుతాయి ? అనే విష‌యం తెలుసు క‌దా, అలాంట‌ప్పుడు ఇబ్బందులు ఎందుకు వ‌స్తున్నాయి ? అస‌లు త‌గిన‌న్ని టీకాల స‌ర‌ఫ‌రా లేన‌ప్పుడు టీకాల‌ను వేస్తాం అని కేంద్రం ఆర్భాటంగా ప్ర‌క‌టించ‌డం ఎందుకు ? జ‌నాల‌ను ఎండ‌లో నిలబెట్ట‌డం ఎందుకు ? అస‌లు ప్ర‌భుత్వాలు ఏవి మారిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఎప్పుడూ ఇలా ఏదో ఒక విధంగా ఇబ్బందులు ప‌డాల్సిందేనా ? ఇక‌నైనా పాల‌కులు మేల్కొనాలి. హంగు, ఆర్భాటంతో కూడిన ప్ర‌క‌ట‌న‌లు మాని ఎంత స‌ర‌ఫ‌రా ఉందో స్ప‌ష్టంగా చెప్పాలి. ఫ‌లానా రోజు ఫ‌లానా మందికి టీకాల‌ను వేస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పాలి. కేంద్రాల వ‌ద్ద ప్ర‌జ‌లు ప‌డే బాధ‌ల‌కు చెక్ పెట్టాలి. లేదంటే ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆగ్ర‌హం పెల్లుబుక‌డం ఖాయం..!!

Read more RELATED
Recommended to you

Latest news