ఉద్యోగుల కొంప ముంచేస్తున్న ఈఎంఐలు… నెలాఖర్లో ఇడ్లీకి కూడా డబ్బులు లేని పరిస్థితి…!

-

జుట్టు ఉంటే ఎన్ని ముళ్ళు అయినా వేయొచ్చు… డబ్బులు ఉంటే ఎంత హడావుడి అయినా చేయొచ్చు… లేని వాడు లేక ఏడుస్తుంటే ఉన్న వాడు ఉండి ఏడుస్తున్నాడు… జేబు నిండుగా ఉంటే విలాసాలకు కొరత ఉండదు… లేకపోతే చాప మీద అయినా పడుకుంటాం… ఇవి అన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం… మన జీవితంలో అవి ఎదురై ఉండవచ్చు లేకపోవచ్చు… కాని నేడు ఉద్యోగులకు అవి ఎదురు అవుతూనే ఉన్నాయి. అవును అలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులకు సరిగా సరిపోతాయి… అది ఎలా అంటారా…? ఈ స్టొరీ చదవండి అర్ధమవుతుంది…

ఎవరి గురించో నేను చెప్పడం ఎందుకు నా గురించే నేను చెప్తున్నాను… నాకు నెలకు 60 వేల ఆదాయం వస్తుంది. నా ఆదాయం ఇంత ఉందని అంచనాకు వచ్చిన నేను… ఫోన్ 40 వేల పెట్టి కొని వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లిస్తున్నాను… నెలకు 3 వేలు దానికి చెల్లిస్తున్నాను… ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వినోదానికి ఏదీ లేదని… ఒక ఐప్యాడ్ 50 వేలు వాయిదాల పద్దతిలో కొనుగులో చేసాను…3,500 దీనికి చెల్లిస్తున్నాను. ఇంట్లో అన్నీ ఉన్నాయి టీవీ, లేదని చెప్పి… ఫ్రెండ్ దగ్గర కార్డు తీసుకుని 40 వేల టీవీ ని వాయిదాల ప్రకారం కొన్నాను.

దీనికి ఒక మూడు వేలు చెల్లిస్తున్నాను… ఏసీ ఆఫర్ లో వస్తుందని కొన్నాను… దానికి 4 వేలకు పైగా వాయిదా ప్రతీ నెలా చెల్లిస్తున్నాను… ఇలా చెప్పుకుంటూ పోతే నా వ్యక్తిగత ఋణం, క్రెడిట్ కార్డ్ వాయిదాలు, ఎడ్యుకేషన్ లోన్ ఇలా ప్రతీ ఒక్కటి నెల నెలా 40 వేలు పైగా చెల్లింపులు పోతున్నాయి. వాటిల్లో చెప్పుకునే ఆస్తి ఒక్కటి కూడా లేదు. రేపు నువ్వు ఏం సంపాదించావు అంటే అందులో ఒక్కటి కూడా నా శాశ్వత ఆస్తి కాదు. కేవలం నేను విలాసాల కోసం, సరదాల కోసం కొనుగోలు చేసినవే… అవి అన్ని పూర్తి కావాలి అంటే 20 నెలలు పైనే పడుతుంది…

నెల పూర్తి అయ్యే సరికి నా చేతిలో ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు ఉండటం లేదు… ఏ చెల్లింపు లేటు అయినా సరే చార్జీల మోత వాసిపోతుంది. ఆ స్కోర్ ఈ స్కోర్ అంటూ భవిష్యత్తు ని భయపెట్టే విధంగా ఉంటున్నాయి. నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను గాని… ఒక నెల జీతం రాకపోతే అప్పు చేసి బ్రతికే పరిస్థితి వచ్చింది అంటే… నా విలాసాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదాయం ఉంది కాబట్టి నేను అన్ని పెట్టుకున్నాను… నా తండ్రి మొన్న నన్ను పది వేలు అడిగితే నా వద్ద ఇవ్వడానికి లేవు…

కనీసం నా చెల్లి రాఖీ కడితే క్రెడిట్ కార్డు నుంచి చెల్లించే పరిస్థితి వచ్చింది… ఎందుకు నాకు ఈ ఖర్మ…? నా ఆర్ధిక జీవనం చూస్తే నాకు భయమేస్తుంది. పల్లెటూర్లో ఉండే నా తండ్రి ఖర్చు నెలకు 10 వేలు దాటడం లేదు. కాని 60 వేలు వస్తున్నా నాకు వెనుక రూపాయి ఉండటం లేదు. రెండు నెలలకు ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్ళే టూర్లు అదనం… వీకెండ్ పార్టీలు, సినిమాలు, మందు అదనం… ఎందుకు ఉద్యోగం చేస్తున్నానో ఈ ఉద్యోగం నుంచి నేను ఏం సంపాదించానో నాకు వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం కనపడటం లేదు.

నేను నాలుగు మాటలు చెప్తాను… పనికొస్తే వాడుకోండి… జీవితంలో డబ్బు అనేది శాశ్వతం… డబ్బు లేనిదే ఏ ఒక్కటి ముందుకి వెళ్ళదు… రేపు బయటకు వెళ్తే నీ వద్ద ఏదైనా ఉంటేనే ఎవడైనా నిన్ను చూస్తాడు ఆదరిస్తాడు… డబ్బు అవసరం లేదని, మంచి తనం ఉంటే చాలు అని పులిహోర కబుర్లు చెప్తూ ఉంటారు. అవి నిజం కాదు… డబ్బు అనేది ముఖ్యం… నువ్వే సంపాదించుకోవాలి… నువ్వు సంపాదించుకున్న రూపాయే నిన్ను ఆదుకుంటుంది. కాబట్టి… ఏ ఆఫర్ కి ఆశ పడవద్దు… ఎలక్ట్రానిక్ వస్తువులను స్టేటస్ అనుకోవద్దు…

లక్ష రూపాయలు సంపాదిస్తున్నావ్ అంటే నెలకు 40 వేలకు పైగా ఆదా చేసుకునేలా అయితే ఉద్యోగం చేసుకో… వస్తువులు కొనుక్కునే ఆసక్తి ఉంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటేనే కొనుగోలు చేసుకో… ఎలక్ట్రానిక్ వస్తువులు వాయిదాలు పూర్తి అయ్యే వరకు కూడా ఉంటాయి అనే నమ్మకం లేదు. ఇంత సంపాదించుకుని కూడా అప్పుల పాలైపోవడం, వాయిదాలు కట్టుకోవడం అనేది నీ ఆర్ధిక జీవనానికి ఎంత మాత్రం మంచిది కాదు. వస్తువు అత్యవసరం అనుకుంటేనే కొనుక్కో… లేదా ఆ వస్తువు మీద ప్రేమ తో మాత్రం కొనుగోలు చేయవద్దు…! ఎందుకంటే నీ డబ్బు నీకు వెనక్కి రాదు…!

Read more RELATED
Recommended to you

Latest news