వైఎస్సార్ కుటుంబంలో ఆయన చనిపోయిన 11 ఏళ్లకు తగాదాలు అవుతున్నాయి.అంటే ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న తగాదాలు అన్నీ ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. మనస్పర్థలు అన్నవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఆగ్రహావేశాల కారణంగా ఇడుపులపాయ ఎస్టేట్ లో జరిగిన తగాదాలు మరియు వాగ్వాదాలు అన్నీ బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైఎస్సార్ గారాలపట్టి షర్మిల తన వాదం వినిపిస్తూ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై కూడా అసంతృప్తి జ్వాలతోనే ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా మలుపు తీసుకోనున్నాయో! అన్నది ఆసక్తిదాయకంగా మారేయి.
ఏపీ గురించి నా దగ్గర మాట్లాడకండి అంటున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల..అసలు ఆయనా పాలన చేయడు ఈయనా పాలన చేయడు అంటూ అటు జగన్ ను ఇటు కేసీఆర్ ను టార్గెట్ చేశారు షర్మిల.. త్వరలోనే ఆంధ్రావనిలో పార్టీ పెడతారు అన్న వాదన ఒకటి షర్మిల విషయమై వినిపిస్తుంది. ఈ దశలో ఆమె స్పందించారు. జిల్లాల ఏర్పాటు అన్నది ఇష్యూ డైవర్షన్ కోసమేనని తేల్చేశారు. ఇంతగా ఆ ఇద్దరి మధ్యా గొడవలకు కారణం ఏంటి? కేవలం పదవి ఇవ్వకపోవడం వల్లనే ఆమె ఇలా స్పందిస్తున్నారా? ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవాళ పొలిటికల్ పొలికేక..
గత కొంత కాలంగా షర్మిల అసంతృప్తితో ఉన్నారు. రాజ్య సభ పదవి తనకు దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్నారు లేదా అన్న జగన్ తనను మోసం చేశారని కూడా బాధపడుతున్నారు. ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా తనకు కనీసం ఓ నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదని అంతర్మథనం చెందుతున్నారు. అవే అసంతృప్తులు ఇవాళ కూడా ఆమెలో ఉన్నాయి. అందుకే ఆమె అన్నపై తిరుగుబాటు చేస్తున్నారు.
అంతేకాదు ఆమె తన అన్న తీరుపై ఆగ్రహావేశాలు వెల్లడి చేస్తున్నారు. ఆ కోవలో ఆ తోవలో ఆమె సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నారు. వాస్తవానికి ఆ ఇరువురి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని అంటున్నారు. ఆస్తి కోసమే షర్మిల పట్టుబడుతున్నారని ఇందుకు జగన్ సమ్మతి ఇవ్వడం లేదని కూడా అంటున్నారు వైఎస్ సన్నిహిత వర్గాలు.
ఆ రోజు అన్న జైల్లో ఉండగా పార్టీని బతికించాల్సిన బాధ్యతను తనపై ఉంచారని, తాను అన్నను గుడ్డిగా నమ్మి ఆ రోజు తన శక్తికి మించి పనిచేశానని, అదేవిధంగా కష్టం అయినా సరే పాదయాత్ర చేశానని కూడా షర్మిల చెబుతుంటారు. ఇంత చేసినా కూడా తనకు గుర్తింపులేకుండా పోయిందని అందుకే ఆమె ఆ కుటుంబంతో అంటే అన్న కుటుంబంతో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓనిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఆమె ఏపీలో పార్టీ పెట్టాలని బలోపేతం కావాలని కూడా
అనుకుంటున్నారు.
– పొలిటికల్ పొలికేక, మన లోకం ప్రత్యేకం