ఇప్ప‌టికైనా చంద్రబాబు మార‌తారా… వాళ్ల మాట‌లు వింటారా…!

-

టీడీపీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం త‌ర్వాత పార్టీ శ్రేణుల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌లువురు సీనియ‌ర్లు మొఖం మీదే చెప్పిన మాట‌ల‌ను చంద్ర‌బాబు ఆల‌కిస్తారా..? లేదా..? వారి మాట‌ల‌కు విలువ‌నిస్తారా..? లేదా..? అని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ మొద‌లైంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ప‌లువురు సీనియ‌ర్లు చాలా సూటిగా మాట్లాడారు. ఏకంగా పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని మొఖంమీదే చెప్పారు. ఎన్నిక‌ల్లో పార్టీ దారుణంగా ఓడిపోయిన త‌ర్వాత ప‌లువురు సీనియ‌ర్లు తీవ్ర ఆవేద‌న‌కు గురవుతున్నారు. ఇందులో అయ్య‌న్న‌పాత్రుడు అయితే.. చంద్ర‌బాబు సూటిగా త‌న అభిప్రాయాల‌ను చేప్పేశారు.

ప్ర‌జ‌లు అడ‌గ‌క‌పోయినా.. అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. వారు జ‌గ‌న్‌కే ఓటు వేశార‌ని అయ్య‌న్న‌పాత్రుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వాన్ని క‌మ్మ‌రాజ్య‌మ‌ని ప‌లువురు విమ‌ర్శించినా.. వాటిని తిప్పికొట్ట‌డంలో మీరు విఫ‌లం అయ్యారంటూ చంద్ర‌బాబుపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. ఇక ఇప్పుడు వైసీపీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అస్త‌వ్య‌స్తంగా ఉంటున్నాయ‌ని, ప‌లు ప‌థ‌కాలు ఆగిపోయినా.. పోల‌వ‌రం టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసినా.. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌ను ప‌క్క‌న‌ప‌డేసినా.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని అయ్య‌న్న‌పాత్రుడు చంద్ర‌బాబు ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

జిల్లా, నియోజ‌వ‌ర్గాల‌వారీగా సమీక్ష‌లు చేసి, పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఆయ‌న ఒక‌ర‌కంగా డిమాండ్ చేశార‌ట‌. ఇక మ‌రో సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా మ‌రింత ఆవేశంగానే మాట్లాడారు. పార్టీలో స్వార్ధపరులకు పెద్ద‌పీట వేశార‌ని, చ‌క్క‌గా వారు ఆస్తులు సంపాదించుకుని వెళ్లిపోతున్నార‌ని.. ఇలా అయితే.. ఎలా అంటూ చంద్ర‌బాబు ముందు త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. లోపాల‌ను స‌వ‌రించుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని, ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి మీతోపాటు.. లోకేశ్ కూడా ఎన్న‌డూ అందుబాటులో లేర‌ని చంద్ర‌బాబు మొఖం మీద‌నే చెప్పారు.

అయితే.. పార్టీలోకి యువరక్తాన్ని తీసుకురావాలని, ఇక‌ ఆ పేరుతో ఇప్పుడున్న నేత‌ల‌ కొడుకులు, కూతుర్లు, కోడళ్లకు టిక్కెట్లు ఇవ్వవద్దని ఆయ‌న‌ స్పష్టం చేశారు. ఇక ఇదే స‌మ‌యంలో బుచ్చ‌య్య‌చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న రాజ‌కీయ జీవితానికి సంబంధించి నిర్ణ‌యం చెప్పేశారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని, యువతకు అవకాశం ఇవ్వాలని ఆయ‌న చంద్ర‌బాబుకు సూచించారు. ప్ర‌స్తుతం తాను శాసనసభ పక్షం ఉపనేతగా ఉన్నానని, ఆ పదవిని వేరే బీసీలకు ఇవ్వాలని కూడా ఆయ‌న సూచించారు. ఈ నేపథ్యంలో ఈ సీనియ‌ర్ల మాట‌ల‌ను చంద్ర‌బాబుకు ఏమేర‌కు వింటార‌న్న‌ది మాత్రం అంత సుల‌భంగా తెలిసే విష‌యం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news