రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. వ్యూహాత్మకంగా వ్యవ హరించకపోతే.. ఫ్యూచరే గల్లంతైన నాయకులు అనేక మంది మనకు కనిపిస్తుంటారు. అయితే, వారిలో చా లా మంది అనేక పదవులు, లేదా పలుమార్లు సభలకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉండడంతో పెద్దగా చర్చకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ, కీలకమైన రాజకీయ నేత వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును సృష్టించుకుని, తనకంటూ.. ఓ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైన ఓ నాయకుడి ఫ్యూచర్ ఇప్పుడు చర్చకు వస్తోంది.
విజయవాడ రాజకీయాల్లో కీలకమైన వంగవీటి రంగా కాపు ఉద్యమంలోనూ వారిని సమీకరించి రాజకీయ శక్తిగా ఎదిగేలా చేయడంలోనూ కీలక రోల్ పోషించారు. బెజవాడ బెబ్బులి వంటి పేర్లతో ఆయన తన అభిమానుల ప్రేమనే కాకుండా మాస్ ప్రజల్లోనూ గుర్తింపు సాధించి ఆయన హత్యకు గురై రెండు దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ.. వంగవీటి రంగా పేరు సజీవం. అయితే, ఆయన వారుసుడిగా రంగ ప్రవేశం చేసిన రాధా కృష్ణ.. తండ్రి చాటు బిడ్డగానే పాలిటిక్స్‌లో ఓనమాలు ప్రారంభించినా.. తనకంటూ. ప్రత్యేక స్టేజ్‌ను ఎక్కడా ఏర్పరుచుకోలేదు. పైగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కాంగ్రెస్‌ను వీడని తన తండ్రి పంథాను తోసరాజని.. ఇష్టానుసారంగా పార్టీలు మారడం ఆయనకే చెల్లింది.
2004లో విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించిన రాధా తర్వాత కాలంలో ప్రజారాజ్యంలోకి, అనంతం జగన్ వెంట నడిచారు. అయితే, తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమిపాల య్యారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ కోసం పట్టుబట్టి ఏకంగా పార్టీ మారిపోయి తన తండ్రి వ్యతిరేకించిన టీడీపీలోకి చేరిపోయారు. అయితే, అక్కడ కూడా టికెట్ రాలేదు. కానీ, రాజ్యసభకు లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఆయన చంద్రబాబు విజయం కోసం కంటే కూడా జగన్ ఓటమి కోసం తాను కృషి చేస్తానని బాహాటంగానే ప్రకటించి, తల్లితో కలిసి యజ్ఞాలు యాగాలు కూడా చేశారు.
ఇక, టీడీపీ ఓటమి తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎవరికీ మొహం చూపించలేదు. మరోపక్క కాపులు కూడా రాధా వెంట తిరిగేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. పోనీ, టీడీపీకి భవిష్యత్తు ఉందా? అంటే.. అసలు రాధాను టీడీపీలో చేర్చిన వంశీ వంటి వారు కూడా పార్టీ మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలనే విషయం రాధాకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోనీ , వైసీపీలోకి వెళ్తాదామా? అంటే.. గేట్లు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యూచర్ ఇక, అంధకారమేనని అంటున్నారు మేధావులు, విశ్లేషకులు కూడా.