క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తారా..? చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్న వేళ‌.. సైంటిస్టులు వ్యాక్సిన్ త‌యారీకి చేస్తున్న ప్ర‌యోగాలు జ‌నాల‌కు కొంత ఊర‌ట‌ను క‌లిగిస్తున్నాయి. క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందంటూ.. వార్త‌లు క‌నిపిస్తే చాలు.. వాటిని జ‌నాలు ఆస‌క్తిగా చ‌దువుతున్నారు. ఎప్ప‌టికైనా మ‌నం ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి త‌ప్పించుకోక‌పోతామా..? అని ప్ర‌జ‌లు ఆశావాద దృక్ప‌థంలో ఉన్నారు. అయితే సైంటిస్టులు ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను అస‌‌లు త‌యారు చేస్తారా..? చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది..? గ‌తంలో ఏవైనా వైర‌స్‌లు వ‌చ్చిన‌ప్పుడు సైంటిస్టులు వ్యాక్సిన్‌ను త‌యారు చేశారా..? అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు వ‌స్తుందా..? అంటే.. అందుకు సైంటిస్టులు ప‌లు స‌మాధానాలు చెబుతున్నారు. అవేమిటంటే…

what happens when corona virus vaccine is not made

లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్ గ్లోబ‌ల్ హెల్త్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ డేవిడ్ న‌బార్రో ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మీడియా చాన‌ల్‌తో మాట్లాడుతూ.. ప‌లు ర‌కాల వైర‌స్‌ల‌కు ఇప్ప‌టికీ మ‌నం ఇంకా వ్యాక్సిన్ల‌ను త‌యారు చేయ‌లేద‌ని అన్నారు. అయితే ఇప్పుడు క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌చ్చితంగా వ‌స్తుంద‌ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని.. అందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. వైర‌స్‌కు వ్యాక్సిన్ రావడం అంటే.. ఆషామాషీ విష‌యం కాద‌ని, అందుకు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని, ఎన్నో టెస్టులను ఆ వ్యాక్సిన్ పాస్ కావాల్సి ఉంటుంద‌ని అన్నారు.

ఇక క‌రోనా వైర‌స్ ముప్పు నుంచి త‌ప్పించుకునేందుకు ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు కూడా జాగ్ర‌త్త‌లు వహించాల‌ని అన్నారు. అయితే క‌రోనా వైర‌స్ గ‌తంలో వ‌చ్చిన హెచ్ఐవీ ఎయిడ్స్ లాంటి వైర‌స్ కాద‌ని, అది త్వ‌ర‌గా మార్పు చెందడం లేద‌ని, క‌నుక సైంటిస్టులు క‌రోనాకు క‌చ్చితంగా వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. కానీ ఒక వేళ వారు వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌లేని ప‌క్షంలో ఆ వైర‌స్‌తో మ‌నం చాలా కాలం స‌హ‌జీవ‌నం చేయాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అలాంట‌ప్పుడు సామాజిక దూరం, ఫేస్‌మాస్కులు ధ‌రించ‌డం, శానిటైజ‌ర్లు వాడ‌డం వంటివి మ‌న నిత్య జీవితంలో భాగం అవుతాయ‌న్నారు. అప్పుడు ఇంత‌కు ముందున్న స్థితి ఉండ‌ద‌ని, అదే జ‌రిగితే.. ప్ర‌పంచంలోని జ‌నాలు కొత్త జీవ‌న విధానాల‌కు అల‌వాటు ప‌డ‌తార‌ని అన్నారు.

ఇక నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అల‌ర్జీ అండ్ ఇన్‌ఫెక్షియ‌స్ డిసీజెస్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆంథోనీ ఫాసి మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ రావాలంటే.. క‌నీసం 12 నుంచి 18 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. అలాగే ఇంగ్లండ్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ క్రిస్ విట్టీ మాట్లాడుతూ.. ఒక ఏడాది వ్య‌వ‌ధి లేదా అంత‌కు లోపే క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చి తీరుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కాగా 1984లో అప్ప‌టి యూఎస్ హెల్త్ సెక్ర‌ట‌రీ మార్గ‌రెట్ హెక్ల‌ర్.. హెచ్ఐవీ ఎయిడ్స్‌కు 2 ఏళ్ల‌లో వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని చెప్పారు.. కానీ 4 ద‌శాబ్దాలైనా ఆ వైర‌స్‌కు సైంటిస్టులు ఇంకా వ్యాక్సిన్‌ను క‌నిపెట్ట‌లేదు. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ ను క‌నిపెట్ట‌డంలో సైంటిస్టులు స‌ఫ‌ల‌మ‌వుతారా..? వారు ఇప్పుడు చెబుతున్న‌ట్లు మ‌రో 12 నుంచి 18 నెల‌ల లోగా వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌క‌పోతే ప‌రిస్థితులు ఎలా ఉంటాయి..? అని అంద‌రూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక‌వేళ క‌రోనాకు వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌క‌పోతే.. ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల మూలంగా క‌రోనా క‌ట్ట‌డి అయినా.. కేసుల సంఖ్య ఏదో ఒక ద‌శ‌లో సున్నా అయినా.. కరోనా ప్ర‌భావం కొంత కాలం వ‌ర‌కు తగ్గినా.. వైర‌స్ మ‌ళ్లీ దాడి చేస్తే.. అప్పుడు ఇంకా తీవ్ర‌మైన ప‌రిణామాలు ఏర్పడుతాయ‌ని సైంటిస్టులు అంటున్నారు. క‌నుక ప్ర‌భుత్వాల ముందు ఇప్పుడున్న ఏకైక మార్గం.. ఎట్టిప‌రిస్థితిలోనైనా స‌రే.. 2 ఏళ్లు అయినా స‌రే.. వ్యాక్సిన్ ను క‌చ్చితంగా త‌యారు చేయాల్సిందే. లేదంటే.. ఎప్ప‌టికైనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తే.. అప్పుడు విప‌రీత ప‌రిణామాలు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాంటి స్థితిలో ప్ర‌భుత్వాలు చేతులెత్తేయ‌డం త‌ప్ప‌.. చేసేదేం ఉండ‌దు.. ఆ ప‌రిస్థితి రావ‌ద్ద‌నే మ‌న‌మంద‌రం ఆశిద్దాం..!

Read more RELATED
Recommended to you

Latest news